
రైతులపై తగ్గనున్న భారం
పేదలకు మేలు
పూర్తిగా తొలగిస్తే బాగుండు
● జీఎస్టీ స్లాబ్‌లలో మార్పు ● వ్యవసాయ ఉపకరణాలపై 5 శాతం పన్ను
చందుర్తి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులపై ఆర్థికభారం తగ్గనుంది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ స్లాబ్‌ను మార్చడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వర్తిస్తున్న 12, 18 శాతం స్లాబ్‌ను 5 శాతానికి కుదించడంతో ధరలు తగ్గనున్నాయి. నిత్యావసర వస్తువులపై 5శాతం, అత్యవసరం కాని వస్తువులపై 18 శాతం నిర్ణయం తీసుకున్నారు. ఈ స్లాబ్ సిస్టమ్ ఈనెల 22 నుంచి అమలుకానుంది. దీంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
రెండింటికే పరిమితం
వస్తు సేవల పన్ను జీఎస్టీ(గూడ్స్ సర్వీసు టాక్స్)ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు అంచెల పద్ధతిలో స్లాబ్ అమలు చేసింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతంలో స్లాబ్ రేట్లు ఉండేవి. ఈనెల 22 నుంచి 5, 18 శాతం స్లాబ్‌రేట్లు మాత్రమే అమలుకానున్నాయి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులన్నీ ఈ రెండు స్లాబ్‌ల్లోకి రానున్నాయి.
గృహ నిర్మాణాదారులకు ఊరట
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలలు నిజం చేసుకునేందుకు తగ్గించి జీఎస్టీ స్లాబ్ ఉపయోగపడనుంది. స్లాబ్ కుదింపుతో సిమెంటు బస్తాలపై అమలులో ఉన్న జీఎస్టీ 28 శాతాన్ని 18 శాతం కుదిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 10 శాతం తగ్గింపుతో నిర్మాణ వ్యయం తగ్గనుంది.
అన్నదాతలకు వరం
ఇప్పటికే రైతులు వ్యవసాయంలో వస్తున్న నష్టాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉపకరణాలపై అమలులో ఉన్న 12, 18 శాతం స్లాబ్‌ను 5 శాతానికి కుదింపుతో వ్యవసాయానికి కొంత ఊరట లభించినట్లు అయ్యింది. రైతులు వినియోగించే పనిముట్ల, యంత్ర పరికరాలు, ట్రాక్టర్ల విడి భాగాల ధరలు భారీగా తగ్గనున్నాయి. పంటలకు పిచికారీ చేసే పురుగుల మందులు ఈ స్లాబ్‌లోకి రానుండడంతో వాటి ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.
నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు
పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. టీవీలు, బైక్‌లు, చిన్న, మధ్యశ్రేణి కార్లు, వైద్యపరికరాలు, బీమాతోపాటు విద్య సంబంధిత పుక్తకాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు.
పేదలపై జీఎస్టీ భారా న్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు రైతులకు ప్రయోజనం కలుగనుంది.
– మార్త సత్తయ్య, బీజేపీ వేములవాడ నియోజకవర్గ కన్వీనర్
ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటను కలిగించింది. అయితే ట్రాక్టర్, పనిముట్లతోపాటు ఎరువులు, పురుగుల మందులపై ఉన్న జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించడం హర్షనీయమే. కానీ పూర్తిగా తొలగిస్తే బాగుండు.
– కాసారపు శ్రీనివాస్‌రెడ్డి, రైతు, నర్సింగపూర్

రైతులపై తగ్గనున్న భారం

రైతులపై తగ్గనున్న భారం