
గల్ఫ్ ఆశలు.. ఏజెంట్ల మోసాలు
వివరాలు ఇలా..
గల్ఫ్ మోసాలు ఉపేక్షించేది లేదు
సిరిసిల్ల క్రైం: సొంతూరులో ఉపాధి కరువై గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న పలువురు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న గల్ఫ్ ఏజెంట్లు డబ్బుల సంపాదనే లక్ష్యంగా విజిట్ వీసాలు కట్టబెడుతున్నారు. డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళ్తున్న పలువురు మోసపోయి అప్పుల కుప్పల్లో చిక్కుకుపోతున్నారు. మోసపోయామని తెలుసుకొని ఎలాగోలా స్వదేశానికి వచ్చిన వారికి ఏజెంట్లు డబ్బులు తిరిగివ్వడం లేదు. ఇలా అక్కడికి పోలేక.. ఇక్కడ ఉన్న పని కోల్పోయి అప్పులపాలవుతున్నారు.
ఆకర్షణీయమైన జీతం పేరిట
గల్ఫ్ దేశాల్లో మంచి వేతనాలు వస్తాయని.. తక్కువ పని, ఎక్కువ వేతనం అంటూ ఆశచూపుతున్న ఏజెంట్లు అక్కడికి వెళ్లాక పని చూపించడం లేదు. ముందుగానే వీసా ప్రాసెసింగ్, మెడికల్ పరీక్షలు అంటూ రూ.10వేలు తీసుకుంటున్న ఏజెంట్లు, వీసా వచ్చిన తర్వాత పనిని బట్టి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి నకిలీ ఏజెంట్ల చేతుల్లో డబ్బులు కుమ్మరిస్తున్న యువకులు తీర అక్కడికి వెళ్లాక మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కొందరు పరువుపోతుందని అంతర్గతంగా చర్చలకు పోతుండగా, కొందరు మాత్రమే పోలీస్‌స్టేషన్‌లకు వచ్చి కేసులు పెడుతున్నారు.
ఉండలేక.. వెనక్కి రాలేక
గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో ఇబ్బందులు పడుతున్న వాళ్లు చదువుకున్న వారే అధికంగా ఉండడం గమనార్హం. ఉద్యోగాల వేటలో నలిగిన యువత ఏదో ఒక పనిచేసి డబ్బులు సంపాదించుకునేందుకు గల్ఫ్ దేశాలకు పోతున్నారు. అక్కడికి వెళ్లాక పనిచేయడం ఒకటైతే.. ఒకే గదిలో కనీసం 10 మందితో కలిసి ఉండడం మరొక ఎత్తు. అక్షరాస్యత లేని వారు రెండేళ్లపాటు ఏదో విధంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. చదువుకున్న యువకులు అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేక వీసా కోసం చేసిన అప్పులు తీరగానే స్వదేశానికి వచ్చేస్తున్నట్లు చర్చ సాగుతుంది.
కేసులు.. మారని తీరు
విదేశాలకు వెళ్లేందుకు వీసాలు అందించే 6 అధికారిక ఏజెన్సీలు జిల్లాలో ఉన్నట్లుగా పోలీస్‌శాఖ వెల్లడించింది. ఈ ఏజెన్సీల ద్వారా వీసా తీసుకొని వెళ్లిన వారికి ముందుగా చెప్పినట్లు పని కల్పించకపోయిన, వేతన వ్యత్యాసాలు ఉన్న సదరు ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన జిల్లాలో గ్రామాల్లో సంచరించే గల్ఫ్ ఏజెంట్లను నమ్మి లక్షలు కుమ్మరించి నిలువునా మునుగుతున్నారు. వీసా వచ్చిన వెంటనే దాని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సీఐ అధికారిని కలవాలని అధికారులు చెబుతున్నారు. కానీ మన జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని వినియోగించుకోవడం లేదు. మోసపోకుండా ఉండాలంటే సహాయ కేంద్రం గురించి, పోలీసులు అందిస్తున్న సేవల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సంవత్సరం కేసులు అరెస్ట్ అయిన ఏజెంట్లు
2023 35 33
2024 63 60
2025 23 23
మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్ల ఆగడాలను ఆదిలోనే అడ్డుకోవాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు వీసా విషయంలో సందేహా లుంటే స్పెషల్ బ్రాంచ్‌లో కలవాలి. ఇబ్బంది ఉంటే 87126 56411కు కాల్ చేసి రక్షణ చర్యలు అడగవచ్చు. గల్ఫ్ ఏజెంట్లు మోసం చేస్తే జైలుకు పంపిస్తాం.
– మహేశ్ బి గీతే, ఎస్పీ

గల్ఫ్ ఆశలు.. ఏజెంట్ల మోసాలు

గల్ఫ్ ఆశలు.. ఏజెంట్ల మోసాలు