● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: మిడ్‌మానేరు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం మిడ్‌మానేరు నిర్వాసితులు 1,550 మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిర్వాసితుల్లో ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితులైన 9 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1,550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రేగులపాటి కృష్ణదేవరాయలు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ విజయప్రకాశ్, ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు.