
ఆడపిల్లను ఎదగనిద్దాం.. చదవనిద్దాం
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
సిరిసిల్ల: ఆడపిల్లను ఎదగనిద్దాం.. చదవనిద్దామని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో గురువారం సంకల్ప్ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ భేటీ పడావో..భేటీ బచావోపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం ఎదగనిద్దామనే నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు కాల్ చేయాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి అంజిలీన మాట్లాడుతూ తల్లిదండ్రులు, బంధువుల బలహీనతను ఆదారం చేసుకొని చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రోగ్రాం అధికారి నయీం జహ, డెమో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
నర్సింగ్ కాలేజీలోనూ...
సిరిసిల్ల నర్సింగ్ కాలేజీలో గురువారం మహిళా సాధికారిత సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. లింగ వివక్ష, లింగనిర్ధారణ, గృహహింస, బాలలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నిషేధం, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్, మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181, 112, 1098 కాల్ చేయాలని సూచించారు. మహిళా సాధికారత సిబ్బంది రోజా తదితరులు పాల్గొన్నారు.