
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నజరానా
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కమలం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుంటే నజరానాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొ న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తొలిసారి కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా బుధవారం పార్టీ శ్రేణులు రేణిగుంట టోల్‌గేట్, అల్గునూ రు చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశానికి రామచందర్‌రావుతో కలిసి హాజరైన బండి సంజయ్ మాట్లాడారు. ఏ గ్రా మంలోనైతే బీజేపీ అభ్యర్థిని ఎంపీటీసీగా గెలిపించుకుంటారో, ఆ గ్రామానికి రూ.5లక్షలు, ఏ మండలంలోనైతే జెడ్పీటీసీని గెలిపించుకుంటారో ఆ మండలానికి రూ.10లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇస్తానన్నారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం ఆరంభంలోనే 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ కిట్లు అందిస్తానని తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అవినీతి స్కాముల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్‌తో కాంగ్రెస్ పెద్దలు లాలూచీ పడటమేనని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పనిచేసే కార్యకర్తలు గెలిచే అవకాశం లేకపోతే నామినేటెడ్ పదవులిచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్‌రావు, శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్ పాల్గొన్నారు.