
ఆధ్యాత్మికం.. అంగరంగ వైభవం
● భక్తిప్రపత్తులతో నవరాత్రులు ● వేములవాడలో నేడు నిమజ్జనోత్సవం
వేములవాడ: వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏ మండపంలో చూసిన కుంకుమ పూజలు.. అన్నదానాలతో కోలాటంగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లోగణేశ్ పూజ చేసేందుకు తరలివస్తున్న భక్తులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులతో మండపాలు కళకళలాడుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న వినాయకులను వేములవాడలో గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మండపాల ముస్తాబు నుంచి నిమజ్జనానికి తరలివెళ్లే సమయంలో నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనల మధ్య అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని మండపానికి తీసుకొచ్చే క్షణం నుంచే అంగరంగ వైభవంగా శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విద్యుత్‌కాంతుల్లో మండపాలు మెరిసిపోతున్నాయి. మహిళలు కోలాటాలు, కుంకుమపూజల్లో ఆసక్తిగా పాల్గొంటున్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో ఎక్కువగా మహిళలు కోలాటాలతో ఉత్సాహం నింపుతున్నారు.