● 23 మంది విద్యార్థుల కథలపుస్తకం ● ఆలోచింపజేస్తున్న బందనకల్ బడిపిల్లల కథలు ● సృజనాత్మకతను చాటిన చిన్నారులు
ముస్తాబాద్(సిరిసిల్ల): కథలు చదివే వయసులో పుస్తకాలు రాస్తున్నారు. చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా కథను చెబుతున్నారు. అందరూ ఇంగ్లిష్ మీడియం.. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ పరుగులు పెడుతున్న కాలంలో పుస్తకాల పఠనమే తగ్గిపోతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే ముస్తాబాద్ మండలం బందనకల్ ప్రభుత్వ బడిపిల్లలు ఏకంగా కథల పుస్తకాన్ని ప్రచురించారు. తమకు వచ్చిన ఆలోచనకు చూసిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని 23 మంది కథలు రాశారు. వీరి కథలను ‘మామిడిపండ్ల గంప’ సంపుటి పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు.
దశాబ్దకాలంగా సాహిత్యబాటలో..
బందనకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదేళ్ల క్రితమే ‘బందనకల్ బాల కవిత్వం’ పేరుతో పద్య కవిత్వం తీసుకొచ్చారు. చక్కని తెలుగు పదాలతో రాసిన కవితలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రధానోపాధ్యాయుడు విఠల్‌నాయక్, తెలుగు భాష ఉపాధ్యాయుడు రమణారెడ్డి విద్యార్థులను ప్రోత్సహించి కవితలు రాయించారు. అదే సాహిత్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈసారి కథల సంపుటిని తీసుకొచ్చారు. మామిడి రసాల మాదిరిగా వీరి కథలు చదివిన కొద్దీ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్, తెలుగు పండితులు రాములు, వెంకటగోపాలాచారి విద్యార్థులు కథలు రాసేలా ప్రోత్సహించారు. చుట్టూ జరిగే సంఘటనలే ఆధారంగా కథలు రాశారు. పదిహేనేళ్ల క్రితం ముస్తాబాద్ జెడ్పీ విద్యార్థులు ‘జాంపండ్లు’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటి వీరికి ప్రేరణగా నిలిచింది. బాలసాహితీ వేత్త గరిపెల్లి అశోక్ మార్గదర్శకంలో వచ్చిన ‘జాంపండ్లు’ కథలు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ముందుచూపుగా నిలిచింది. నేషనల్ బుక్‌ట్రస్టు జిల్లాలో నిర్వహించిన వర్క్‌షాపులు భవిష్యత్ కవులు, రచయితలను తయారు చేసింది.
మామిడిపండ్ల ఘుమఘుమలు
బందనకల్ బడిపిల్లల కథలలోకి వెళ్తే నిత్యం చూస్తున్న సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకున్నారు. నీతి, నిజాయితీ, నమ్మకం, స్నేహం, బాధ్యత, కనువిప్పు, ప్రకృతి, మార్పు మంచిదే.. వంటి సందేశం ఇచ్చే కథలను రాశారు. చిన్నారుల కలం నుంచి జాలువారిన కథలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. అమ్మమాట, మల్లమ్మ, చెట్టంత ఆలోచన వంటి 23 కథలు పుస్తకంలో ఉన్నాయి. ఒక్కో కథను ఒక్కో విద్యార్థి రాయడం విశేషం. మరిన్ని పుస్తకాలు తెస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు.
బడిపిల్లల మామిడిపండ్ల గంప