
ఓటరూ.. ఒక్క నిమిషం
పంచాయతీ ఎన్నికల స్వరూపం
ఓటు ఉందో.. లేదో..
● పల్లె ఓటరు జాబితా సిద్ధం ● అభ్యంతరాలకు నేడు ఆఖరు గడువు ● సెప్టెంబరు 2న తుది జాబితా
సిరిసిల్ల: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికారికంగా ఓటర్ల జాబితా వెల్లడించడంతో ఒక్కో అడుగు పడుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తడవుగా అధికారులు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అవసరం మేరకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బ్యాక్స్‌లు తెప్పించుకున్నారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించి సిద్ధం చేశారు. సెప్టెంబరు 30వ తేదీలోగా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.
గ్రామం యూనిట్‌గా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికలకు గ్రామం యూనిట్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని వార్డుల వారీగా ఓటర్ల విభజన జరిగింది. ఒక్క కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా విభజన చేశారు. 200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,734 ఉండగా.. 400 ఓటర్లు ఉన్నవి 468, 650 ఓటర్లు ఉన్నవి 66, 650 ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే.. రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి మొదటి విడత శిక్షణ ఇచ్చారు.
రిజర్వేషన్లపైనే ఆసక్తి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఈసారి మారుతుందా? అనే దానిపై చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలో నిలిచేందుకు అనేక మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను సమీకరించుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు.
మండలాలు : 12
గ్రామపంచాయతీలు : 260
వార్డులు : 2,268, ఓటర్లు : 3,52,134
సర్పంచ్‌లకు గుర్తులు : 30 (పింక్ కలర్)
వార్డు సభ్యుల గుర్తులు : 20 (వైట్ కలర్)
ఓటరు జాబితాలో పేరు ఉందో.. లేదో.. మొదట చూసుకోండి. లేకుంటే వెంటనే తగిన ఆధారాలతో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోండి. అప్పుడు ఓటుహక్కు లభిస్తుంది. లేకుంటే మీరు ఓటుహక్కు కోల్పోయినట్లే. ఇప్పుడు చూసుకోక తీర ఎన్నికల రోజు వచ్చి పేరు లేకుంటే కావాలనే తీసేశారు అని గగ్గోలు పెడితే వచ్చేదేముండదు.