
కరెంటు బిల్లులు కట్టలేం
● సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు ● వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించాలి : సెస్ చైర్మన్
సిరిసిల్లటౌన్: కక్షపూరితంగా తమపై బాదుతున్న కరెంటు బిల్లులు కట్టలేమని.. కరెంట్ కనెక్షన్‌లు కట్ చేయడాన్ని నిరసిస్తూ నేతన్నలు శుక్రవారం సిరిసిల్లలో రోడ్డెక్కారు. సెస్ ఆఫీస్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమకు సంబంధించి బ్యాక్ బిల్లింగ్ పేరుతో సెస్ అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడాన్ని తప్పుబట్టారు. బ్యాక్ బిల్లింగ్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వస్త్రపరిశ్రమ నాయకుడు మండల సత్యం మాట్లాడుతూ ఇప్పుడే దారిలో పడుతున్న వస్త్ర పరిశ్రమపై సెస్ అధికారులు 2016 నుంచి బ్యాక్ బిల్లింగ్ చెల్లించాలంటూ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సరికాదన్నారు. తమ పవర్‌లూమ్స్ కార్ఖానాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ సెస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నేతన్నల ఆందోళనను విరమింపజేశారు.
బిల్లులు చెల్లించాలి
సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ వస్త్రపరిశ్రమకు సంబంధించిన బ్యాక్‌బిల్లింగ్‌తో సంబంధం లేకుండా వినియోగించిన విద్యుత్‌కు మాత్రమే బిల్లులు చెల్లించాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కొంతమంది కోర్టును ఆశ్రయించడంతోనే బ్యాక్ బిల్లింగ్ వసూళ్లకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇటీవల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధ్యక్షతన యజమానులతో నిర్వహించిన సమావేశంలో బ్యాక్ బిల్లింగ్‌కు సంబంధం లేకుండా ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లును ఒక్కో యూనిట్‌కు రూ.2 చొప్పున చెల్లించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. సెస్‌కు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.100కోట్లకు పైగా సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. సంస్థ మనుగడ సాగాలంటే బిల్లులు చెల్లించాలని కోరారు. డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, నారాయణరావు పాల్గొన్నారు.