
అపారనష్టం
అపారనష్టం
గంభీరావుపేట మండలంలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
గంభీరావుపేట(సిరిసిల్ల): అన్నదాతలకు కష్టమొచ్చింది.. ఆపై నష్టమొచ్చింది. విపరీత వరదలతో పంటపొలాలు నీట మునిగాయి. కొన్ని పొలాల్లో ఇసుకమేటలు వేసింది. ఎన్నడూ లేని విధంగా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కడంతో పరివాహక వాగు కనివినీ ఎరుగని రీతిలో పొలాల్లో నుంచి ప్రవహించింది.
పంటనష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మల్లారెడ్డిపేట, నర్మాల, కోళ్లమద్ది, లింగన్నపేటల్లో దాదాపు 315 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 295 మంది రైతులకు సంబంధించిన 210 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. అదేవిధంగా 120 మంది రైతులకు చెందిన 105 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నట్లు అంచనా. వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.