
త్రిఫ్ట్ పథకం డబ్బులు వచ్చేశాయ్..
● 26న కార్మికులకు పంపిణీ ● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు
సిరిసిల్లటౌన్: త్రిఫ్ట్ ఫండ్(నేతన్న పొదుపు) డబ్బులను కార్మికులకు ఈనెల 26న అందజేయనున్నట్లు సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు శనివారం తెలిపారు. పొదుపు పథకం ప్రవేశపెట్టి మూడేళ్లు పూర్తికావడంతో ఈ డబ్బులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 4,963 మంది కార్మికులు జమచేసుకున్న రూ.12.40కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా ధనం రూ.12.40కోట్లను రికరింగ్ ఖాతాల(ఆర్‌డీ2)లో జమ చేసినట్లు తెలిపారు. ఆ డబ్బులను ఈనెల 26న మంత్రుల చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అంతేకాకుండా అకాల మరణం చెందిన 12 మంది నేతకార్మికుల కుటుంబ సభ్యులకు నేతన్న భద్రత పథకం ద్వారా రూ.5లక్షల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి శనివారం ఎల్‌ఎండీకి 8,018 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్యాకేజీ–10 అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. మిడ్‌మానేరులోకి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి 21,368 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.936 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, పొత్తూరు గ్రామ శివారు నుంచి మానేరువాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది.