
సింగసముద్రం కాలువకు మరమ్మతు
● ఖర్చు భరిస్తానన్న ఎమ్మెల్యే కేటీఆర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మెట్టప్రాంత వరప్రదాయని సింగసముద్రం పూడికతీత పనులను శనివారం ఆయకట్టు రైతులు శ్రమదానంతో చేపట్టారు. ఎగువమానేరు మత్తడి దూకుతోంది. ఆ నీరు కాలువల ద్వారా సింగసముద్రంలోకి వస్తోంది. కాలువలు పూడిక, ముళ్లపొదలు, గడ్డితో నిండిపోవడంతో నీరు వృథాగా పోతోంది. సింగసముద్రం నిండితేనే జక్కులచెరువు, గాలంచెరువు, గిద్ద చెరువులు నిండుతాయి. రాచర్లబొప్పాపూర్ శివారులోని సింగసముద్రానికి వచ్చే కాలువ మరమ్మతు పనులు చేయాలని మూడు రోజులుగా రైతులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో అన్నదాతలే శ్రమదానంతో కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. పూడికతీత, ముళ్లపొదలు, గడ్డి తొలగింపునకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడి పనులు చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.