
మత్తుపదార్థాలను కట్టడి చేయాలి
● మట్టి వినాయకులను పూజించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: మత్తు పదార్థాలను కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి శనివారం నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో తంబాకు, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తెలిపా రు. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యంషాపులు మూసివేయాలని ఆదేశించారు. గంజాయి సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని తెలిపారు. ఆస్పత్రులు, మెడికల్‌షాపుల్లో స్టాక్ వివరాలను తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు.
మట్టి గణపతులను పూజించాలి
మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డ్ రూపొందించిన పోస్టర్‌ను ఆవి ష్కరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెండు వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు
వేములవాడలో సెప్టెంబర్ 4న, సిరిసిల్లలో 6న వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద పవర్‌జనరేటర్‌లను సిద్ధం చేయాలన్నారు. నిమజ్జనం మార్గంలో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.
వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి
సిరిసిల్లక్రైం: వినాయక మండపాల వివరాలు పోలీస్‌శాఖ విడుదల చేసిన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. మండపాల నిర్వాహకులతో శనివారం సమావేశమయ్యారు. అత్యధిక శబ్దాన్నిచ్చే డీజే బాక్సులు నిషేధమని స్పష్టం చేశారు.