
గండ్లు.. కోతలు
● అధ్వానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువలు ● ఐదేళు్‌ాల్గ మరమ్మతు కరువు ● పూడుకుపోయిన గ్రావిటీ కెనాల్స్ ● దారుణంగా పిల్లకాల్వలు ● నీరు పారడం అనుమానమే..
చందుర్తి (వేములవాడ): అడుగుకో గండి.. గజానికో కోత.. నిండా పిచ్చిమొక్కలు.. నీరు పారే పరిస్థితి కనపించని వైనం. ఇదీ ఎల్లంపల్లి కాల్వల దుస్థితి. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మించిన కాలువలు ఎక్కడికక్కడ కోతలకు గురయ్యాయి. ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన కాలువలను మరమ్మతు చేయించేవారు కరువయ్యారు. గండ్లు పడ్డ చోట నుంచి వరదనీరు ప్రవహించడంతో పంట చేలు దెబ్బతింటున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాల్వల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.
కూలిన కాల్వలు
● వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్ నుంచి చందుర్తి మండలం నర్సింగపూర్ నుంచి మల్యాల పంపుహౌజ్‌కు, అక్కడి నుంచి బండపల్లి రిజర్వాయర్ వరకు నిర్మించిన గ్రావిటీ కెనాల్‌తోపాటు కొన్ని గ్రామాల్లో పిల్లకాలువలు కూలి పోయాయి. మరమ్మతు చేపట్టకపోవడంతో వర్షాలకు గండ్లు పడిన చోట నుంచి పొలాల నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు.
● పిల్ల కాలువల్లో దట్టంగా చెట్లు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతున్నాయి. చందుర్తి మండలం తిమ్మాపూర్, రామన్నపల్లి, ఆశిరెడ్డిపల్లి, నర్సింగపూర్, మర్రిగడ్డ, జోగాపూర్, ఎన్గల్ మధ్య నిర్మించిన కాలువల్లో నీరు పొలాల నుంచి ప్రవహిస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. పలు గ్రామాల మద్య నిర్మించిన పిల్ల కాలువలు సగానికి పైగా కూలిపోయాయి. చందుర్తి మండలంలో ప్రధాన కాలువ 27 కిలోమీటర్ల పొడవు ఉండగా.. పిల్ల కాలువలు 170 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తున్నాయి.
మరమ్మతు చేపడితేనే..
చందుర్తి మండలం మల్యాల పంపుహౌస్ నుంచి బండపల్లి రిజర్వాయర్‌కు వచ్చే గ్రావిటీ కెనాల్‌లో వరద కొట్టుకు రావడంతో కూలి మట్టితో నిండిపోయింది. ఆ మట్టిని తొలగిస్తేనే నీళ్లు బండపల్లి రిజర్వాయర్‌కు చేరే పరిస్థితి ఉంది. నర్సింగపూర్ నుంచి చందుర్తి వరకు గ్రావిటి కెనాల్‌లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. చందుర్తి 450 ట్యాంక్ నుంచి నిర్మించిన కాల్వలకు భారీగా గండిపడి ఐదేళ్లు గడుస్తున్నా తాత్కాళిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారని ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామం నుంచి నిర్మించిన కాలువలకు గండిపడి సుమారు 50 ఎకరాలకు పైగా పంట దెబ్బతింటుందని రైతులే బ్లేడ్ ట్రాక్టర్‌తో తాత్కాళిక మరమ్మతులు చేయించుకున్నారు.
పిచ్చిమొక్కలు తొలగించాలి
పిల్ల కాలువలల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు ప్రవహించక కాల్వలకు గండ్లు పడ్డాయి. గండ్లుపడ్డ కాల్వలను మరమ్మతు చేయించాలి. కాల్వలో పిచ్చిమొక్కలను తొలగిస్తేనే పంట పొలాలకు నీరందే అవకాశం ఉంటుంది. – జగిత్యాల రాజు, నర్సింగపూర్
ప్రతిపాదనలు పంపాం
భారీ వర్షాలతో అక్కడక్కడ కాలువలు కూలిపోయాయి. పనులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపించాం. వాటికి నిధులు మంంజూరైతే పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత నాలుగేళ్లుగా ప్రతిపాదనలు ఏటా పంపుతున్నాం.
– సంతు ప్రకాశ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈఈ

గండ్లు.. కోతలు

గండ్లు.. కోతలు

గండ్లు.. కోతలు

గండ్లు.. కోతలు