
దరి చేరనున్న ‘డబుల్’ ఇళ్లు
● నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే ● ‘డబుల్’ ఇళ్లపై సాక్షి వరుస కథనాలు ● పీహెచ్‌సీ సమస్యపై ఫోకస్ ● స్పందించిన అధికారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలకు దిగుతున్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను, పీహెచ్‌సీ భవనం, బిక్కవాగుపై వంతెన మిగులు పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్య నాలుగేళ్లుగా ఉండగా.. దీనిపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. ఏళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. గతంలోనే సాక్షి కథనంతో స్పందించిన అధికారులు డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి రోడ్డు వేయించారు. అదేవిధంగా మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి 2023 అక్టోబర్ 6న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శిలాఫలకం వేయగా పనులు ప్రారంభించలేదు. ఈ సమస్యను సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, ఆస్పత్రి భవన నిర్మాణ పనులను సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. అంతేకాకుండా గత ఆరేళ్లుగా అనంతారం–ఇల్లంతకుంట మధ్య గల బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు బిక్కుబిక్కుగా ప్రయాణం చేస్తున్నారు. బ్రిడ్జి మిగులు పనులు పూర్తి చేసేందుకు రూ.44 లక్షలు మంజూరుకాగా.. ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. మండలంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

దరి చేరనున్న ‘డబుల్’ ఇళ్లు