
రెండో విడత కూల్చివేతలు షురూ
● కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం ● ఫలించని కొంత మంది యజమానుల న్యాయ పోరాటం ● హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు
వేములవాడ: వేములవాడ పట్టణానికి ఇదొక చారిత్రక ఘట్టంగా జనం చెప్పుకుంటున్నారు. కొన్నితరాలుగా ఎదురుచూసిన కల ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్య, ఆలయాలకు వచ్చే భక్తులకయ్యే ఇబ్బందులు కనుమరుగు కానున్నాయి. 60 ఏళ్ల కల సాకారం కానుందని జనం సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నో చర్చలు జరిగినా, కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ల పట్టుదలతో చేపట్టిన కార్యాచరణ ఇప్పుడు ఆ కలకు ఆకారాన్నిచ్చాయి. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తయ్యింది. చుట్టుపక్కల గోడలు, నిర్మాణాలు ధ్వంసమవుతున్నా, ప్రజల మనస్సుల్లో ఆశల పునాది పడింది. కోర్టు స్టేతో నిలిచిన 88 నిర్మాణాలు శుక్రవారం కూల్చివేతలు మొదలయ్యాయి. ఐదుగురు తహసీల్దార్లు ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తంగా 80 ఫీట్ల విస్తరణతో భవనాలను కూల్చి వేస్తున్నారు. గతనెల 16న ప్రారంభమైన రోడ్ల విస్తరణ ప్రక్రియ కోర్టు స్టేతో ఆగింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం పూర్తిస్థాయి కూల్చివేతలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీంతో ఇక వేములవాడ రోడ్ల విస్తరణ పరిపూర్ణం కానుంది.
విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్
రహదారి విస్తరణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు, సిబ్బంది ఉన్నారు.