
ఉషోదయపు ‘ఉపాధి’
● చిన్న పెట్టుబడి.. నమ్మకమైన ఉపాధి ● నేతకార్మిక కుటుంబ బతుకుబాట ● ఆ యువకుడి ఐడియా అదిరింది
సిరిసిల్ల: డిగ్రీలు.. పీజీలు చేసినా.. ఉద్యోగాలు రావడం లేదని, ఉపాధి లేక, ఇల్లు గడవడం లేదని, ఏదైనా వ్యాపారం చేస్తామంటే.. పెట్టుబడి లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని నేటి తరం యువతరం విసిగిపోతుంది. సెల్‌ఫోన్లు చూస్తూ.. రీల్స్ చేస్తూ.. కాలక్షేపంతో కాలం వెల్లబుచ్చుతున్నారు ఎందరో యువకులు. అందుకు భిన్నంగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి చెందిన ఆంకారపు శివకృష్ణ(27). సిరిసిల్లలోనే డిగ్రీ చేసిన శివకృష్ణ ఒక్క ఐడియాతో తెల్లవారుజామునే శ్రమిస్తూ.. స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. చిన్న పెట్టుబడితో.. చిరు వ్యాపారాన్ని ప్రారంభించి.. ఉషోదయపు ఉపాధిని సొంతం చేసుకున్నారు.
ఇంట్లో తయారీ.. వీధిలో విక్రయాలు
నిత్యం ఉదయం పూట వాకింగ్, జాగింగ్ చేసే వారికి అవసరమైన జ్యూస్‌లను ఇంట్లో తయారీ చేసి.. స్థానిక కోర్టు ఎదురుగా టేబుల్‌పై పెట్టుకుని విక్రయిస్తున్నాడు. ఆరోగ్య ప్రదాయినిగా భావించే గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయల జ్యూస్‌లను, మరోవైపు యాపిల్, బీట్‌రూట్, క్యారెట్(ఏబీసీ) జ్యూస్‌ల మిశ్రమాన్ని తయారు చేశాడు. పెసర్లు, బబ్బెర్ల, పచ్చిబఠానీలను నానబెట్టి మొలకలు వచ్చిన వాటితో క్యారెట్, బీట్‌రూట్ ముక్కల మిశ్రమాన్ని తయారు చేసి బాక్స్‌ల్లో విక్రయిస్తున్నారు. జ్యూస్‌లు రూ.20 గ్లాసు చొప్పున, మొలకల బాక్స్‌లను రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నాడు. ఇంట్లోనే అన్నీ సిద్ధం చేసుకొని వచ్చి కోర్టు వద్ద రోడ్డుపై ఉదయం 6.30 నుంచి 9.30 గంటల వరకు విక్రయిస్తుంటాడు.
రూ.25వేల పెట్టుబడితో పక్కా ఉపాధి
శివకృష్ణ నాన్న పోశెట్టి సాంచాలు నడిపిస్తాడు. అమ్మ సుజాత బీడీలు చేస్తుంది. అతని భార్య లాస్యశ్రీ చదువుకుంటుంది. వీరికి ఒక బాబు. నేతకార్మిక కుటుంబానికి చెందిన శివకృష్ణ రూ.25వేల పెట్టుబడితో నమ్మకమైన ఉపాధికి బాటలు వేసుకున్నాడు. జ్యూస్‌లు పట్టేందుకు ప్రత్యేకమైన మిక్సీ మిషన్, జ్యూస్‌లను నిల్వ చేసేందుకు అందమైన జాడీలను, జ్యూస్‌గ్లాసులు, మొలకలు విక్రయించే బ్యాక్స్‌లు, స్పూన్లు ఇలా అన్నింటికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాడు. జ్యూస్‌లను, మొలక మిశ్రమాన్ని విక్రయించడం ప్రారంభించాడు. నిత్యం రూ.1200 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నాడు. ఇందులో ముడిసరుకులకు పెట్టుబడి పోను రోజూ రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుతుంది. ఇలా నెలకు రూ.24వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
నిత్యం 4 గంటలకే నిద్రలేస్తా..
నిత్యం 4 గంటలకే నిద్రలేసి కాయలను ముక్కలు చేసుకుని జ్యూస్‌లు పట్టుకుంటా. మొదట్లో అందరూ చూస్తూ వెళ్లిపోయారు. రెండు, మూడు రోజుల్లోనే జ్యూస్‌లకు అలవాటు పడ్డారు. అందరూ తాగుతున్నారు. ముందు రోజే మార్కెట్ నుంచి అన్నీ తెచ్చుకుని సిద్ధం చేసుకుంటాను. ఎప్పుడైనా తెల్లవారుజామున వర్షం పడిన రోజు నేను రాకుంటే ఫోన్లు చేసి మరీ వస్తున్నారు. జ్యూస్‌ల వ్యాపారం బాగుంది. ఇల్లు గడుస్తుంది. – ఆంకారపు శివకృష్ణ, చిరువ్యాపారి

ఉషోదయపు ‘ఉపాధి’