
ఎన్నికలల్లో నేతలు
● బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆశలు ● ముందుగా గ్రామ‘పంచాయతా’.. మండల పరిషతా ? ● ఎన్నికలపై ఆసక్తికర చర్చ ● ఓటర్ల జాబితా విభజనకు కొత్త లాగిన్ ● గతంలోని విభజనతో గందరగోళం
సిరిసిల్ల: స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండగా.. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు అందడం లేదు. ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించడంతో రంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రిజర్వేషన్లు కలిసి వస్తే స్థానికసంస్థల ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటుకోవాలని అనేక మంది నాయకులు పోరుకు సై అంటున్నారు. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా? గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు నిర్వహిస్తుందా? అనే దానిపై స్పష్టత రాలేదు.
ఓటర్ల విభజనకు కొత్త లాగిన్
ఓటర్ల జాబితా విభజనకు కొత్త లాగిన్‌ను అందించారు. గ్రామం యూనిట్‌గా ఉండే ఓటర్ల జాబితాలో వార్డుల వారీగా విభజనకు కొత్త లాగిన్ ఇచ్చారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కొత్త లాగిన్‌లోనే ఓటర్ల జాబితాను విభజించాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన లాగిన్‌లో ఓటర్ల జాబితాను విభజించగా గందరగోళంగా తయారైంది. గ్రామాల్లో వార్డు హద్దులను తెలిపే కటాఫ్ ఇంటి నంబర్లు, ఓటరు జాబితాలోని నంబర్లు కలిసిపోయి గందరగోళం కావడంతో కొత్త లాగిన్‌లో పకడ్బందీగా మళ్లీ ప్రిపేర్ చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
పెరిగిన ఐదు పంచాయతీలు
జిల్లాలో గతంలో 255 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఐదు గ్రామపంచాయతీలు పెరిగాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ పరిధిలోని జైసేవాలాల్ తండా, రాచర్ల బాకురుపల్లి, గంభీరావుపేట మండలం ముచ్చర్ల శివారులోని హీరాలాల్‌తండా, ఇల్లంతకుంట మండలం రేపాక నుంచి విడిపోయిన తాళ్లపల్లి, దాచారం నుంచి విడిపోయిన బోటిమీదపల్లి కొత్తగా గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. కొత్త వాటితో కలుపుకుని జిల్లాలో 260 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,908 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
123 ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో 123 మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల(ఎంపీటీసీ) స్థానాలు ఉండగా.. 12 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల(జెడ్పీటీసీ) స్థానాలు ఉన్నాయి. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 14 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో 13 స్థానాల చొప్పున, కోనరావుపేటలో 12, బోయినపల్లిలో 11, చందుర్తిలో 10, వేములవాడరూరల్‌లో 7, వేములవాడలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కొత్త మండలాలైన రుద్రంగి, వీర్నపల్లిల్లో 5 ఎంపీటీసీ స్థానాల చొప్పున ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా అభ్యర్థులు బీ–ఫామ్‌లతో పోటీ చేస్తారు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీలు జెడ్పీ చైర్‌పర్సన్‌గా, మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికవుతారు. ఈరకు అన్ని పార్టీల్లోని ముఖ్యనాయకులు స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు.
రిజర్వేషన్లపైనే దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారాయి. అన్ని స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండగా.. ఈసారి కొత్తగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్ కలిసి వస్తే గ్రామపంచాయతీ నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ పెద్దల అండతో జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తాచాటేందుకు జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న వారు రిజర్వేషన్లు కలిసి వస్తే బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటి నుంచి కులసంఘాలను, యువజన సంఘాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తూ.. పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దల అండతో ‘స్థానిక’ పోరుకు సన్నద్ధమవుతున్నారు.