
పోకిరీలపై నిఘా
● మహిళలు, యువతలకు భరోసా ● విద్యాసంస్థలు, పనిస్థలాల వద్ద మఫ్టీలో గస్తీ ● తక్షణ సహాయానికి 87126 56425● వేధిస్తే కటకటాలకే
సిరిసిల్ల క్రైం: ఏం చేసినా చెల్లుతుందిలే.. ఆడవాళ్లే కదా ఎవరికీ చెప్పుకుంటారు.. బయటకు చెప్పుకుంటే వారి పరువు పోతుంది.. ఏదైనా కామెంట్ చేయొచ్చు.. వెకిలిగా ప్రవర్తించొచ్చు.. అనుకునే పోకిరీలకు షీటీమ్ సభ్యులు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. స్కూళ్లు.. కాలేజీలు.. ఫ్యాక్టరీలు.. ప్రాంతం ఏదైనా ఆడవాళ్లే బాధితులుగా మిగులుతున్నారు. పోకిరీల చేష్టలను భరించొద్దని టోల్‌ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేస్తే నిమిషాల్లో వచ్చి రక్షణ కల్పిస్తామంటున్నారు జిల్లా షీటీమ్ మెంబర్స్. ఇటీవల పలువురు పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో యువతులు.. మహిళలకు భరోసాగా నిలుస్తున్నా షీటీమ్‌పై స్పెషల్ స్టోరీ.
బాధ్యతగా ఉంటూ... భరోసా కల్పిస్తూ..
జిల్లా షీటీంలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇటీవల మహిళలు పని చేసే ప్రాంతాల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించారు. ఫలితంగా సిరిసిల్ల శివారులోని ఓ కంపెనీలో తోటి ఉద్యోగి చేస్తున్న వెకిలిచేష్టలపై తిరుగుబాటు చేశారు. దీంతో అక్కడ వారికి వేధింపులు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఓ విద్యాసంస్థలోనూ విద్యార్థినులు చాలా రోజులుగా భరిస్తున్న వెకిలిచేష్టలపై నోరు విప్పారు. ఫలితంగా అక్కడ పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఇక అక్కడి విద్యార్థినులు భరోసాగా బడికి వస్తున్నారు.
కౌన్సెలింగ్.. కేసు నమోదు
వెకిలి చేష్టలకు పాల్పడితే వెంటనే షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అదే పనిగా మళ్లీ వేధింపులకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నారు. విద్యార్థినులు, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో నమోదైన కేసుల వివరాలు
నెల ఎఫ్‌ఐఆర్ పెట్టీ
ఏప్రిల్ 3 5
మే 3 6
జూన్ 2 4
మహిళల రక్షణే తొలి ప్రాధాన్యం
మహిళలు, విద్యార్థి నుల రక్షణే తొలి ప్రా ధాన్యం. జిల్లాలోని అన్ని స్టేషన్‌ల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏదేని సహాయం, కౌన్సెలింగ్ అవసరమైతే షీటీం బృందాలను పంపిస్తున్నాం. షీటీం పోలీసులతో నిఘా పెట్టి పోకిరీల ఆగడాలను మొదట్లోనే నియంత్రిస్తున్నాం.
– మహేశ్ బీ గీతే, ఎస్పీ, రాజన్నసిరిసిల్ల

పోకిరీలపై నిఘా