
గురుకులంలో ‘ఓటింగ్ పాఠం’
● నర్మాల గురుకులంలో మాక్ పోలింగ్
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులు ఓటర్లుగా మారారు.. టీచర్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు.. ఎన్నికల్లో పోటీచేసిన తోటి విద్యార్థులకు ఓటువేసి కెప్టెన్లుగా ఎన్నుకున్నారు. అచ్చం సాధారణ ఎన్నికలను తలపించేలా గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో శనివారం మాక్‌పోలింగ్ నిర్వహించారు. స్కూల్ కెప్టెన్ సహా వివిధ విభాగాలకు సంబంధించి మరో 24 మందిని కెప్టెన్లుగా, వైస్‌కెప్టెన్లుగా ఎన్నుకున్నారు.
అర్థమయ్యేలా ‘ఎన్నికల పాఠం’
విద్యార్థులకు ఓటుహక్కు విలువ, ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల పరిచయం, పోలింగ్‌కేంద్రం, బ్యాలెట్ పేపర్లు, చేతివేలిపై సిరాచుక్క ఆవశ్యకత, అభ్యర్థుల ప్రచారం, నామినేషన్ దాఖలు, ఓటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ప్రతీ తరగతిని ఓటర్లుగా, విద్యార్థులనే అభ్యర్థులుగా రూపొందించి, ఓటింగ్‌బూత్‌లు ఏర్పాటు చేసి, ఓటింగ్ సరళిని అనుకరించారు.
ఎన్నికై న కెప్టెన్లు వీరే..
పాఠశాలలో స్కూల్ కెప్టెన్, వైస్‌కెప్టెన్, కల్చరల్, లిటరరీ, మెర్క్యురీ, వీనస్, మాస్, జూపిటర్ గదులకు కెప్టెన్లు, వైస్‌కెప్టెన్లను ఎన్నుకున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందేలా స్కూల్ కెప్టెన్ పర్యవేక్షిస్తుంటారు. మిగతా కెప్టెన్లను సమన్వయ పరుస్తూ ఆయా విభాగాల్లో పనితీరును పరిశీలిస్తారు. క్రీడలను రస్పోర్ట్స్ కెప్టెన్ పర్యవేక్షిస్తారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే క్రీడల విషయాలన్నింటిని కూడా పర్యవేక్షించి ఉపాధ్యాయుల ద్వారా తోటి విద్యార్థులకు చెబుతుంటారు. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని కల్చరల్ కెప్టెన్ పర్యవేక్షిస్తారు. చదువులో ప్రగతిని పరిశీలించడానికి లిటరరీ కెప్టెన్ పనిచేస్తుంటారు.