సాలె గూడు! | - | Sakshi
Sakshi News home page

సాలె గూడు!

Jul 9 2025 7:03 AM | Updated on Jul 9 2025 7:03 AM

సాలె

సాలె గూడు!

దురాశల

‘మెటా’లో నిలువుదోపిడీకి గురైన

ఒకే సామాజిక వర్గం

కొందరు ఫిర్యాదు

చేసినా నమోదవని కేసులు

బాధితుల్లో పోలీసులు, రెవెన్యూ, టీచర్లే అధికం

గుండె, పక్షవాతం, బీపీ బారిన పడుతున్న వైనం

ప్రజల నుంచి రూ.100 కోట్లకు పైగానే వసూలు

ఘటనపై కరీంనగర్‌ సీపీ, నిఘా వర్గాల ఆరా

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

రీంనగర్‌లో ‘సాక్షి’ వెలికితీసిన మరో క్రిప్టోకరెన్సీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెటా పేరిట కరీంనగర్‌ కేంద్రంగా సాగిన వసూళ్ల దందాపై డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం, ఇంటెలిజెన్స్‌ విభాగాలు వేర్వేరుగా ఆరా తీయడం ప్రారంభించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న మాజీ కార్పొరేటర్‌, అతని అనుచరుల పూర్తి వివరాలు సేకరించారు. మెటా బాధితులు కరీంనగర్‌ కమిషనరేట్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి పరిధిలో ఎక్కడైనా పోలీసులకు ఫిర్యాదులు చేశారా? ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? పిటిషన్ల రూపంలో ఫిర్యాదులు ఎక్కడెక్కడున్నాయి? ఎందుకు కేసులు నమోదు కాలేదు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కేవలం రూ.100 కోట్లదందా కాదని, అంతకు రెండు, మూడింతలు ఉంటుందని పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ కరీంనగర్‌లో రూ.10 కోట్లు కాదని, అంతకు రెండింతలు వసూలు చేశారని చెబుతున్నారు.

నల్లడబ్బు.. కిక్కురుమనని ఉద్యోగులు

ఈ వ్యవహారంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు (పోలీసులు, రెవెన్యూ, సర్కారు టీచర్లు) భారీగా పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రంలో రియల్‌రంగం కుంటుపడటంతో క్రిప్టోలో పెట్టుబడులు ప్రారంభించారు. ఇదే సమయంలో మెటాపేరుతో యాప్‌ పుట్టుకురావడం, దానిలో అత్యధికంగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు భారీగా పెట్టుబడి పెట్టడంతో అనతికాలంలోనే రూ.వందలకోట్ల వసూళ్లు రాబట్టగలిగారు. జగిత్యాల జిల్లాలో సర్కారు టీచర్లే దాదాపు రూ.30 కోట్లకుపైగా వసూళ్లు చేశారని సమాచారం. మూడు నెలల తర్వాత చెల్లింపుల విషయంలో యాప్‌ మొరాయించడంతో మాజీ కార్పొరేటర్‌ ముందస్తుగానే తనను తాను రక్షించుకునే ఎత్తువేశాడు. గతంలో ఓ మాజీ మంత్రికి అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తి.. మాజీ మంత్రి పార్టీ మారడంతో కొంతకాలం వేచిచూశాడు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అధికార పార్టీలో చేరాడు. కొంతకాలంగా పలువురు మంత్రులకు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ యాప్‌లో పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు అత్యధిక సంఖ్యలో బంధువులు, బినామీలతో పెట్టబడులు పెట్టించారు. అందులో సింహభాగం నల్లడబ్బు కావడం, వీరిపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో వారు బయటికి రాకుండా ఓ దళిత నేతను మధ్యలో పెట్టి వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకునేందుకు యత్నిస్తున్నారు.

‘కట్లపాము’లా రక్తం పీల్చేవాడు..

ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్‌ క్రిప్టోకరెన్సీ రూ.95 కోట్లు కొల్లగొట్టిన రమేశ్‌గౌడ్‌ను సీఐడీ పోలీసులు దుబాయ్‌ పారిపోయే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు. కరీంనగర్‌ సీఐడీకి చెందిన ఓ డీఎస్పీ నిందితుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ‘సాక్షి’ దినపత్రిక ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఉన్నతాధికారులు అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితులు ఇంకా నిందితులపై నమ్మకంతో తమ డబ్బులు వస్తాయన్న దింపుడుకళ్లెం ఆశలతో దీనంగా ఎదురుచూస్తున్నారు. రూ.వందల కోట్లు వసూళ్లు చేసిన ఇప్పటికే లోకేశ్‌ దేశంవీడి థాయ్‌లాండ్‌ వెళ్లగా.. మాజీ కార్పొరేటర్‌ మాత్రం మళ్లీ పోటీకి సిద్ధమవుతుండటం, ఇతర చోటా నేతలు ఇంకా యథేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం. జనాలపాలిట ‘నోట్ల కట్టల పాము’లా పేరొందిన సదరు మాజీ కార్పొరేటర్‌ డబ్బు కోసం ప్రజల రక్తం తాగాడన్న పేరుంది. ఎక్కడ ఇల్లు కట్టినా.. అక్కడ వాలిపోయి.. రూ.లక్షలకు లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలకు లెక్కలేదు. అప్పట్లో అధికార పార్టీ కావడం, ఓ మంత్రికి ప్రధాన అనుచరుడు కావడంతో అతని ఆగడాలు సాగాయి. ఇప్పుడు ఈ కేసు నుంచి రక్షణ పొందేందుకు ముందుచూపుతోనే అధికార పార్టీలో చేరాడు. అదే పార్టీ నుంచి కరీంనగర్‌ బల్దియాలో తిరిగి పోటీచేసేందుకు టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం.

నలిగిపోతున్న బాధితులు..

ఈ యాప్‌లో ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మాట అటుంచితే.. కులపెద్దల మాటలు నమ్మి.. భూములు, ప్లాట్లు, బంగారం విక్రయించి, పర్సనల్‌ లోన్లు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టారు. వారు చేర్పించిన వారంతా డబ్బులు ఏవంటూ నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. తీవ్ర ఒత్తిడితో వీరిలో ముగ్గురికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. మరోవ్యక్తికి గుండెపోటు వచ్చింది. చాలామందికి బీపీలు పెరిగాయి. ఓ మహిళ అత్యాశతో రూ.22 లక్షలు బ్యాంకులో పర్సనల్‌లోన్‌ తీసుకుని యాప్‌లో చేరింది. ఆమె భర్త డబ్బులు ఏవంటూ రోజూ ఆమెను హింసిస్తున్నాడు. ఇలా అత్యాశకు పోయి.. ‘మెటా’ సాలెగూడులో చిక్కిన పేద, మధ్య తరగతి వారిది ఒక్కొక్కరిదీ ఒక్కోదయనీయ గాథ. కులంపేరు చెప్పగానే.. అత్యాశ మత్తులో నిలువునా మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి డీజీపీ కార్యాలయం పిలిచినా, ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. ఇప్పటికే ప్రధానసూత్రధారి లోకేశ్‌ ఇండియా వీడి థాయ్‌లాండ్‌ చేరుకున్నాడని బాధితులు చెబుతున్నారు. కరీంనగర్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న మాజీ కార్పొరేటర్‌పై కరీంనగర్‌లోని రెండు ఠాణాల్లో ఇటీవల బాధితులు ఫిర్యాదులు చేశారు. అయినా, ఇవి ఇంకా పిటిషన్ల దశలోనే ఉండటం గమనార్హం.

సాలె గూడు!1
1/3

సాలె గూడు!

సాలె గూడు!2
2/3

సాలె గూడు!

సాలె గూడు!3
3/3

సాలె గూడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement