
ప్రత్యేక రైలుకు స్పందన కరువు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్–తిరుపతి ప్రత్యేక రైలుకు ప్రయాణికులు కరువయ్యారు. వారానికి ఒకరోజు నడిచే ఈ ప్రత్యేక రైలు పూర్తిగా త్రీ టైర్ ఏసీ కంపార్ట్‌మెంట్లు ఉండటంతో పాటు ప్రయాణ సమయం, హాల్టింగులు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ఈనెల 6నుంచి తిరుపతి–కరీంనగర్ ప్రత్యేక రైలును నడిపిప్తోంది. తిరుపతిలో ప్రతీ ఆదివారం రాత్రి7.45గంటలకు బయల్ధేరి మరుసటిరోజు సోమవారం ఉదయం7.18గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. మొత్తం తిరుపతి నుంచి 4ట్రిప్పులు, కరీంనగర్ నుంచి 4ట్రిప్పులు నడిపించనున్నారు. సాధారణంగా తిరుపతి వెళ్లే రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెలరోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే ప్రక్రియతో పాటు తత్కాల్ సౌకర్యం ఉంటుంది. మొత్తం ఏసీ కంపార్ట్‌మెంట్లుండగా జనరల్ కంపార్ట్‌మెంట్లు లేకపోవడంతో పాటు అనువుగాని సమయంలో నడిపిస్తున్న ప్రత్యేక రైలుకు ప్రయాఱికుల ఆదరణ కరువైంది. ఈ ప్రత్యేక రైలును రెగ్యులర్ రైలు తరహాలో అన్ని కంపార్ట్‌మెంట్లతో నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
త్రీ టైర్ ఏసీ బోగీలకే పరిమితం
జనరల్ ప్రయాణికులకు నిరాశ