
మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● 37 మందికి రూ.38 లక్షల రుణాలు
సిరిసిల్ల: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం 37 మంది మహిళలకు రూ.38లక్షల బ్యాంకు రుణాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. తీసుకున్న రుణాలతో ఆర్థికంగా బలోపేతమై.. తిరిగి చెల్లించాలని కోరారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ.14.96లక్షలు, తంగళ్లపల్లిలో ఒక్కరికి రూ.30వేలు, గంభీరావుపేటలో 8 మందికి రూ.7.66లక్షలు, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2.67లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13.04లక్షల రుణాలు అందించారు. మహిళా సంఘాల సభ్యులు ఇద్దరు ప్రమాదశాత్తు మరణించగా వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని పంపిణీ చేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
పర్యావరణ్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరణ
జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్–2025 పోస్టర్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటిసంరక్షణ, చెట్లు నాటడం, తడి పొడిచెత్త వేరు చేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, డీవైఎస్‌వో రాందాస్, జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య పాల్గొన్నారు.