● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
సిరిసిల్ల: మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం బోయినపల్లి మండలంలోని ముంపు గ్రామాలు కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే సత్యం అర్హులందరికీ పరిహారం, మిగతా ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దరఖాస్తులపై మరోసారి అధికారులతో సర్వే చేయిస్తామని తెలిపారు. కొదురుపాకలో గురువారం, వరదవెల్లిలో శుక్రవారం, నీలోజిపల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రత్యేక శిబిరం నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో, ఎస్‌డీసీ రాధాబాయ్, బోయినపల్లి తహసీల్దార్ నారాయణరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ముంపు గ్రామాల ఐక్యవేదిక ప్రతినిధి కూస రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేతో భరోసా
సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా నిలిచేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం 27 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని ఆయా ఠాణాల అధికారులకు సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. స్థానిక పీహెచ్‌సీని సోమవారం తనిఖీ చేశారు. మందుల నిల్వలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంత ఉద్యోగ విరమణ సందర్భంగా ఆమెను సన్మానించారు. వైద్యులు శరణ్య, జీవనజ్యోతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అంజేలియో ఆల్ఫ్రెడ్, నయీమ్‌జహ, రామకృష్ణ, అనిత, హెచ్‌ఈవో వెంకటరమణ ప్రసాద్ పాల్గొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా ఖదీర్‌పాషా
సిరిసిల్ల: మున్సిపల్ కమిషనర్‌గా ఖదీర్‌పాషా సోమవారం విధుల్లో చేరారు. నిజామాబాద్ మున్సిపల్ నుంచి పదోన్నతిపై సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బదిలీ అయ్యారు. ఇన్‌చార్జి కమిషనర్ పి.వాణి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మున్సిపల్ డీఈఈగా ఉన్న వాణి ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిస్థాయి కమిషనర్ రావడంతో ఆమె డీఈఈగా కొనసాగనున్నారు. టీపీవో సాయికృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ఇరిగేషన్ ఇన్‌చార్జి ఈఈగా ప్రశాంత్
సిరిసిల్ల: జిల్లా నీటిపారుదలశాఖ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా టి.ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. చందుర్తిలో ఇరిగేషన్ డీఈఈగా విధులు నిర్వహించే ప్రశాంత్‌కు ఇరిగేషన్ శాఖ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు