
‘మొక్క’వోని లక్ష్యం చేరేనా !
● జిల్లాలో 6.77లక్షల మొక్కలు లక్ష్యం ● నర్సరీల్లో 12 లక్షల మొక్కలు సిద్ధం ● గ్రామీణులకు అవగాహన కరువు ● లక్ష్యం చేరడంపై అనుమానాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన వనమహోత్సవం నీరసంగా కొనసాగుతోంది. గ్రామీణులకు ఈ కార్యక్రమంపై అవగాహన లేకపోవడంతో ముందుకురావడం లేదు. ఉపాధిహామీలో నాటాల్సిన మొక్కలపై అధికారుల నిర్లక్ష్యానికి లక్ష్యం పూర్తయ్యేలా లేదు. జిల్లాలో 6.77లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం చేరడం అనుమానంగా కనిపిస్తుంది. గతేడాది ఉపాధిహామీలో 6.06లక్షల మొక్కలు నాటారు.
తూతు మంత్రంగా నర్సరీలు
జిల్లాలో 255 నర్సరీల్లో నామమాత్రంగానే మొక్కల పెంపకం చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని అత్యధిక నర్సరీల్లో 3వేల మొక్కలు పెంచారు. అయితే కొన్ని మొక్కలు సరిగ్గా ఎదగలేవు. కొన్ని నర్సరీల్లో ఖాళీ కవర్లే కనిపిస్తున్నాయి. కొన్ని నర్సరీల్లో గతేడాది పెంచిన మొక్కలే కనిపిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ 2వేలు, విద్యాశాఖ 2వేలు, ఇరిగేషన్ 7వేలు, పోలీస్‌శాఖ 4వేలు, వ్యవసాయశాఖ 22వేలు, ఉద్యానవనశాఖ 6వేల మొక్కలు పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కమ్యూనిటీ ప్రదేశాల్లోనే పెంపకం
జిల్లాలో పది విడతల్లో హరితహరంలో చేపట్టిన మొక్కల పెంపకంతో ఖాళీ ప్రదేశాలు లేకుండా పోయాయి. ప్రభుత్వ, బంజేరు భూములతోపాటు రోడ్లు, కాల్వల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వనమహోత్సవంలో కులసంఘాల భవనాలు, ఖాళీ ప్రదేశాలతోపాటు ఎండిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గుంతలు తీసి పెట్టుకున్నారు.
వనమహోత్సవం లక్ష్యం
బోయినపల్లి 30వేలు
చందుర్తి 70వేలు
ఇల్లంతకుంట 76వేలు
గంభీరావుపేట 76వేలు
కోనరావుపేట 80వేలు
ముస్తాబాద్ 75వేలు
రుద్రంగి 10వేలు
తంగళ్లపల్లి 75వేలు
వీర్నపల్లి 10వేలు
వేములవాడ(ఆర్) 20వేలు
వేములవాడ అర్బన్ 10వేలు
ఎల్లారెడ్డిపేట 80వేలు
సిరిసిల్ల మున్సిపల్ 2.08లక్షలు
వేములవాడ మున్సిపల్స్ 2.08లక్షలు