
సైబర్ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
● ఎస్పీ మహేశ్ బీ గితే
సిరిసిల్లక్రైం: సైబర్ ఫిర్యాదులపై తక్షణం స్పందించి కేసులు నమోదు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించాలని, బ్యాంకులో డబ్బు ఫ్రీజ్ అయి ఉంటే వీలైనంత త్వరగా తిరిగి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్ వారియర్స్‌కు ఫోన్ నంబర్ కేటాయించినట్లు వివరించారు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని, మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టులని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందని, వారి వలలో పడకుండా ఉండటానికి అప్రమత్తతే ప్రధాన ఆయుధం అన్నారు. జిల్లా సైబర్ సెల్ ఆర్‌ఎస్సై జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిని పోషించకుంటే ఆస్తి దక్కదు
సిరిసిల్లకల్చరల్: వయోధికులకు ఎదురైన సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డీవో వెంకటేశ్వర్లు మంగళవారం బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పెద్దూరు గ్రామానికి చెందిన గొడుగు ఎల్లవ్వకు రాములు, దేవయ్య సంతానం. భర్త జీవించి ఉన్న సమయంలో తనకున్న భూమిలోంచి మూడెకరాలు ఇద్దరు కొడుకులకు పట్టా చేయించాడు. మరో 2.19 ఎకరాలు ఎల్లవ్వ పేరున ఉంది. తల్లిని తానే పోషిస్తానని ఆమె పేరున ఉన్న భూమిని దేవయ్య పట్టా చేయించుకున్నాడు. అన్నదమ్ముల భేదాభిప్రాయాలతో తల్లి పోషణ బాధ్యతలను విస్మరించారు. దీంతో తన భూమి తనకు చెందేలా చూడాలని ఎల్లవ్వ ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంది. ఈక్రమంలో పోషణ బాధ్యతలు చేపట్టకుంటే ఆస్తిని తిరిగి తల్లి పేరుమీద మార్చేస్తామని, వారం రోజుల్లోపు తేల్చుకోవాలని ఆర్డీవో హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దేవిక, రాజ్యలక్ష్మి, సీనియర్ సిటీజన్ల సంఘం ప్రతినిధులు డాక్టర్ జనపాల శంకరయ్య, దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి