
బడిని బతికించిన ఉపాధ్యాయుడు
వేములవాడరూరల్: ఆ బడి ఒకప్పుడు పిల్లలతో క ళకళలాడేది. అలాంటి బడి కొన్నేళ్లు విద్యార్థులు తగ్గి వెలవెలబోయింది. ఏడాది క్రితం వచ్చిన ఉపా ధ్యాయుడు పట్టుదలతో ఇంటింటా తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ బడిని బతికించుకుందామని అవగాహన కల్పించారు. అన్ని సౌకర్యాలు ఉన్న బడిలో పిల్లలను చేర్పించాలని, ప్రైవేటుకు వద్దంటూ చెప్పిన మాటలకు తల్లిదండ్రులు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం కళకళలాడుతున్న బడిని చూసి గ్రామస్తులు, మండల అధికారులు ఇటీవల ఆ ఉపాధ్యాయుడిని సత్కరించారు.
8 మంది నుంచి 38..
ఏడాది క్రితం ఉపాధ్యాయుడు ఊరడి రవి వేములవాడ మండలం లింగంపల్లి పాఠశాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు 1 నుంచి 3వ తరగతి వరకు 8 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. విశాలమైన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్న ఈ పాఠశాలకు పిల్లలు ఎందుకు రావడం లేదంటూ ఆరా తీశారు. వెంటనే ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ప్రస్తుతం 1 నుంచి 4వ తరగతి వరకు మొత్తం 38 మంది పిల్లలను చేర్పించి పూర్వ వైభవం తీసుకువచ్చారు. గతంలో బాలనగర్‌లోని పాఠశాల మూతపడగా ఇదే ఉపాధ్యాయుడు ఆ బడికి ప్రాణం పోసి విద్యార్థులను చేర్పించడంతో ప్రస్తుతం అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతో ఆ స్కూల్ కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో బోధిస్తూ, పిల్లలను చేర్పించడంలో చొరవ చూపుతున్న కొంత మంది ఉపాధ్యాయులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.