
బాలిక మృతిపై అడిషనల్ ఎస్పీ విచారణ
చందుర్తి(వేములవాడ): ఆర్‌ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతిచెందిన ఘటనపై ఏఎస్పీ చంద్రయ్య విచారణ చేపట్టారు. మండలంలోని కిష్టంపేటకు చెందిన కుదురిక మహాల(8) గత నెల 19న పత్తి చేనులో తేలుకాటుకు గురైంది. తల్లిదండ్రులు లావణ్య, రమేశ్ వెంటనే జోగాపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ సంజీవ్‌తో వైద్యం చేయించారు. 20న బాలిక పల్స్ పడిపోవడంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలిక చికిత్స పొందుతూ 28న మృతిచెందగా, ఆర్‌ఎంపీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏఎస్పీ మంగళవారం బాలిక తల్లిదండ్రుల స్టేట్‌మెంటును రికార్డు చేశారు. అనంతరం ఎస్సీ కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని సూచించారు. ఆపద సమయంలో ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తారని, వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ ఉన్నారు.