
ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు
వేములవాడ: సీఎం రేవంత్‌రెడ్డి సహకారం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కృషితో వేములవాడ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కథలాపూర్ మండలం సిరికొండలోని రేణుక ఎల్లమ్మ, రాజరాజేశ్వరస్వామి, మేడిపల్లి మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి, వేములవాడ అర్బన్ మండలం మారుపాకలోని పెద్దమ్మతల్లి ఆలయాలకు రూ.1.95 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజన్న ప్రసాదం
వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచందర్‌రావును మంగళవారం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న ప్రసాదం అందించి శాలువాతో సత్కరించారు. వారి వెంట కోల కిష్టస్వామి, రేగుల మల్లికార్జున్, చంటి మహేశ్, రేగుల శ్రీకాంత్ ఉన్నారు.
బందనకల్ అమరులకు నివాళి
సిరిసిల్ల: బందనకల్ అమరులకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఘనంగా నివాళి అర్పించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సంస్మరణ సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. అభ్యుదయ సమాజం కోసం అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసిన కామ్రెడ్ రియాజ్ తదితర అమరులను కొనియాడారు. అసమానతలు లేని సమాజం కోసం నక్సలైట్లు కోరుకుంటుంటే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు రెండు లక్షల ఎకరాల అడవిని అప్పగించేందుకు మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్నారు. అరుణోదయ కళాకారిణి విమలక్క మాట్లాడుతూ, ప్రకృతి వనరులను విధ్వంసం చేయడంతో పాటు ఆదివాసీల జీవితాలను ఛిద్రం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. జీవన్‌కుమార్, కట్టా భగవంతరెడ్డి, అరుణోదయ ప్రతినిధులు మల్సూర్, పోతుల రమేశ్, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి కొమురయ్య, రాయమల్లు, యాకన్న, అరుణ పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ట్రై యాతలాన్ ఎంపిక పోటీలు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీగ్రౌండ్‌లో జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పాల్గొని వివిధ క్రీడాంశాల్లో ప్రతిభచాటారు. ఈనెల 6న హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే స్టేట్ లెవల్ పోటీలకు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి రామచంద్రం, ఎస్‌ఐ గొట్టే రామచంద్రం తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్, పీఈటీలు అజయ్‌కుమార్, శ్రీనివాస్, రవి, హనుమంతు అభినయ పెప్సిబా, బాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ముసురు వాన
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం ముసురు వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్‌లో 24.1 మి.మీ వర్షం పడగా , రుద్రంగి 6.4, చందుర్తి 9.6, వేములవాడరూరల్ 8.6, బోయినపల్లి 6.5, వేములవాడ 12.5, సిరిసిల్ల 11.6, కోనరావుపేట 15.6, వీర్నపల్లి 10.7, ఎల్లారెడ్డిపేట 9.5, గంభీరావుపేట 22.6, తంగళ్లపలి 15.3, ఇల్లంతకుంటలో 12.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.

ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు

ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు

ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు