
చిల్లర చిక్కులకు చెక్
● ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు ● పల్లెవెలుగుల్లోనూ అందుబాటులోకి ● కండక్టర్లకు, ప్రయాణికులకు తప్పిన తిప్పలు
ఇల్లంతకుంట(మానకొండూర్): దయచేసి కండక్టర్ చిల్లర ఇచ్చి సహకరించండి.. అనే రాతలు ఆర్టీసీ బస్సులలో చూస్తుంటాం. అయితే చిల్లర చిక్కులకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ సంస్థ బస్సులలో టికెట్‌కు ఆన్‌లైన్ పేమెంట్స్‌ను ప్రవేశపెట్టింది. ఇలాంటి అవకాశం మొన్నటి వరకు డీలక్స్ బస్సుల్లోనే ఉండేది. కానీ తాజాగా పల్లెవెలుగు బస్సుల్లోనూ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా టికెట్ డబ్బులు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. దీంతో అటు కండక్టర్‌కు ఇటు ప్రయాణికులకు చిల్లర కష్టాలు తీరిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో పురుషులు మాత్రమే టికెట్‌కు డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో కండక్టర్ వద్ద డబ్బులు తక్కువగా ఉంటున్నాయి. ఈక్రమంలోనే చిల్లర కష్టాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఆర్టీసీ సంస్థ ఆన్‌లైన్ చెల్లింపులు తేవడంతో ఈ కష్టాలు దూరమయ్యాయి. బుధవారం కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు ఇల్లంతకుంటకు రాగా.. అందులో ఆన్‌లైన్ చెల్లింపులకు అవకాశం ఉండడంతో ప్రయాణికులు చిల్లర కోసం ఇబ్బంది పడకుండా ఫోన్‌పే, జీపే ద్వారా చెల్లిస్తూ సంతోషంగా ప్రయాణించారు.
చిల్లర బాధ తప్పుతుంది
నేను కరీంనగర్ వన్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. టికెట్టు ఇచ్చే టిమ్ మిషన్‌లో ఫోన్‌పే, గూగుల్‌పే యాప్ రావడంతో చిల్లర కష్టాలు తీరిపోయాయి. ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ ప్రాబ్లం వస్తుంది.
– టి.సంతోషికుమారి,
కండక్టర్, కరీంనగర్ డిపో–1