
అంగన్‌వాడీల్లో ఎగ్ బిర్యానీ
గంభీరావుపేట(సిరిసిల్ల): అంగన్‌వాడీల్లోని పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసింది. ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ బుధవారం ఎగ్‌బిర్యానీ అందిస్తుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ వడ్డిస్తున్నారు. పోషకాహారలోపం నివారణలో భాగంగా తీసుకున్న ఈ కొత్తచర్యను పిల్లలు, తల్లిదండ్రులు సంతోషంగా స్వీకరిస్తున్నారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 0–6నెలల చిన్నారులు 2,757 మంది, 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 17,532, 3–6 ఏళ్ల పిల్లలు 15,791 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ ప్రతీ బుధవారం ఎగ్‌బిర్యానీ వడ్డిస్తున్నారు. గుడ్డు ప్రోటీన్లతో పాటు బియ్యం, కూరగాయల ద్వారా కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు లభించడంతో పిల్లలకు సమతుల ఆహారం అందుతోంది. బిర్యానీ వడ్డిస్తుండడంతో పిల్లలు ప్రతీ రోజు అంగన్‌వాడీలకు వస్తున్నారు. గుడ్ల నాణ్యత, వంటకాల్లో పరిశుభ్రత వంటి అంశాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఫలితాలు బాగుంటాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
చిన్నారులకు మరింత పౌష్టికాహారం
ప్రతీ బుధవారం అమలు
క్రమం తప్పకుండా అందిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ బుధవారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఎగ్ బిర్యానీ పెడుతున్నాం. చిన్నారుల నుంచి స్పందన బాగుంది. ఎగ్ బిర్యానీ కోసం చిన్నారులు ఆసక్తిగా వస్తున్నారు. ఎగ్ బిర్యానీ అమలుతో విద్యార్థుల హాజరుశాతం పెరుగుతోంది.
– శ్రావణి, అంగన్‌వాడీ టీచర్,
గంభీరావుపేట

అంగన్‌వాడీల్లో ఎగ్ బిర్యానీ