
మామిడి తోట.. పేలిన తూటా!
● ప్రభుత్వంతో చర్చల ప్రతినిధి రియాజ్‌తోపాటు నలుగురి ఎన్‌కౌంటర్
● బందనకల్ ఎన్‌కౌంటర్‌కు 20 ఏళ్లు
● హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు సంస్మరణ సభ
● శాంతమ్మ సమర గాథ సీడీ ఆవిష్కరణ
సిరిసిల్ల: అది 2005 జూలై 1వ తేదీ... అప్పుడే తెల్లవారుతోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారి పక్కనే మామిడితోట.. అక్కడ అన్నీ పోలీసు జీపులు.. సాయుధ పోలీసుల పహరా.. పొలాల వద్దకు వెళ్లే రైతులను అటుగా వెళ్లకుండా.. కట్టడి చేస్తున్న పోలీసులు.. ఏంజరిగిందో తెలియక స్థానికుల హైరానా.. పొద్దెక్కుతోంది.. సూర్యుడు ఎరుపెక్కుతున్నాడు.. నేలపై గడ్డిపరకలపై మంచు బిందులు తడారిపోతున్నాయి.. మామిడి తోటలో నాలుగు శవాలు రక్తం ముద్దలుగా ఉన్నాయి. బందనకల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్టు మృతి చెందారు. ఆ ఎన్‌కౌంటర్ మృతుల్లో 2004 అక్టోబరులో ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన శాంతి చర్చల జనశక్తి ప్రతినిధిగా వచ్చిన రియాజ్ అలియాస్ వెంకటేశ్ ఉన్నారు. మరో ముగ్గురిలో మానేరు ప్రాంత దళనాయకులు గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన రాగుల శ్రీశైలం అలియాస్ విజయ్, సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కు చెందిన గౌతమ్, జనగామ జిల్లా కడవెండికి చెందిన పెద్దిరాజు ఉన్నారు. ఆ ఘటన జరిగి సరిగ్గా నేటికి 20 ఏళ్లు అవుతుంది.
చెల్లాచెదురుగా శవాలు
బందనకల్–మోహిణికుంట శివారుల్లోని మామిడితోటలో ఎన్‌కౌంటర్ శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందరి చేతుల వద్ద కిట్ బ్యాగులు.. ఆయుధాలు.. రియాజ్ శవం వద్ద విప్లవ సాహిత్యం.. తూటా గాయాలతో.. రక్తం గడ్డకట్టి.. నలుపెక్కిపోయింది. శవాలు విసిరేసినట్లుగా పడిఉన్నాయి. అప్పటి జిల్లా ఓఎస్‌డీ (ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సంఘటన స్థలానికి వచ్చేంత వరకు మీడియాను అనుమతించకుండా పోలీసులు కట్టడిచేశారు. సాయుధ నక్సలైట్లు మామిడితోటలో సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసులతో గాలింపులు జరుపుగుతుండగా.. పోలీసులను చూసి నక్సలైట్లు కాల్పులు జరిపారు.. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు సాయుధ నక్సలైట్లు చనిపోయారు. మిగితా వాళ్లు తప్పించుకున్నారు.. ఇది ఓఎస్‌డీ ప్రకటన సారాంశం.
ఎన్‌కౌంటర్‌కు ముందే.. బంధీలు అయ్యారని పత్రికల్లో ప్రకటన
హైదరాబాద్ కాచీగూడ ప్రాంతంలో జనశక్తి చర్చల ప్రతినిధి రియాజ్ మరో ముగ్గురిని అప్పటి కరీంనగర్ జిల్లా పోలీసులు బంధించారని, వారిని ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, రాజ్యాంగ బద్దంగా వారిపై ఏమైనా పోలీసులు కేసులు ఉంటే.. వెంటనే కోర్టులో హాజరు పరచాలని అప్పటి ‘జనశక్తి’ ప్రతినిధి చందన్న, ఇతర ప్రజాసంఘాల పేరిట ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన అన్ని ప్రముఖ పత్రికల్లో ఎన్‌కౌంటర్ కంటే ముందే ప్రచురితమైంది. కానీ.. ఆ నలుగురిని పట్టించిన కోవర్టును రక్షించుకోడానికి ఆ రాత్రి ఎన్‌కౌంటర్ పోలీసులకు అనివార్యమైంది. శాంతి దూతను చంపుతారా? అంటూ.. అప్పటి టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలు ఆ ఎన్‌కౌంటర్‌ను ఖండించారు. హోంమంత్రి జానారెడ్డి ఎన్‌కౌంటర్‌పై విచారం వ్యక్తం చేశారు. రియాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. చంపి సాయం చేయడం ఏమిటని రియాజ్ భార్య లక్ష్మీదేవి సర్కార్ సాయాన్ని తిరస్కరించారు. అప్పట్లో ఈ ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఒకింత ఢిపెన్స్‌లో పడింది. న్యాయవిచారణకు ఆదేశించింది.
కావలి నుంచి సిరిసిల్లకు..
ఎన్‌కౌంటర్ మృతుడు రియాజ్ అలియాస్ వెంకటేశ్ సొంతూరు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని అయ్యంగారిపల్లె. నిరుపేద మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన వెంకటేశ్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పుస్తకాల పురుగుగా.. నిరంతరం అధ్యయనం చేసే వెంకటేశ్ ప్రజాఉద్యమాల్లో పాల్గొంటూ.. జనశక్తి పార్టీ పక్షాన 2004లో చర్చల ప్రతినిధి అయ్యాడు. ఆ చర్చల్లో జనశక్తి పక్షాన వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ ప్రముఖుడు. రెండో వ్యక్తి రియాజ్. బందనకల్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో మృతుడు జనశక్తి లీగల్ ఆర్గనైజర్ పెద్ది రాజు విద్యావంతుడు.
మారుమోగిన
రియాజ్ పాటలు
బందనకల్ ఎన్‌కౌంటర్ మృతుడు రియాజ్‌పై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేక పాటలను వెలువరించింది. మిత్రకలం పేరుతో అమర్ రాసిన పాటను విమలక్క గానంచేసింది. శ్ఙ్రీకడలి నిన్ను కడుపులోన దాసుకున్న రాతిరి.. అలలే ఊయలగా నిను ఆడించిన రాతిరి.. అయ్యంగారిపల్లె.. హాహాకారాల్లో కరిగి.. కన్నతండ్రి వలలోకి కన్నబిడ్డనిచ్చిన రుద్రుడు ఆ సముద్రుడికి ఉన్న మనసు.. ఈ కాంగ్రెసు సర్కారుకు లేక పాయే.. రియాజు.. రియాజు నా వెంకటేశూ.. అంటూ.. సాగే పల్లవితో వచ్చిన పాటతో పాటు.. బందనకల్ ఎన్‌కౌంటర్ మృతుల స్మృతి గీతాలు ఆరు పాటలు పల్లెల్లో మారుమోగాయి. రియాజ్‌పై అనే క వ్యాసాలు వచ్చాయి. ఆయన రచనలపై పీడీఎస్‌యూ(విజృంభణ) పుస్తకం ప్రచురించింది.
నేడు హైదరాబాద్‌లో సంస్మరణ సభ
బందనకల్ అమరుల 20వ వర్ధంతి సభను హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అమరుల స్మారక కమిటీ పేరుతో వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతమ్మ సమరగాథ పాటల సీడీని ఆవిష్కరించనున్నారు. అమరవీరుల స్మారక కమిటీ కన్వీనర్ డేగల రమ, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, జీవన్‌కుమార్, ఆచార్యా కట్టా భగవంతరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమల, నాగిరెడ్డి, వెల్తురు సదానందం, మల్లేశం, టి.అంజయ్య, అల్లూరి విజయ్, ఏపూరి మల్సూర్, రమేశ్ పోతుల, అరుణ, రాయమల్లు పాల్గొననున్నారు.

మామిడి తోట.. పేలిన తూటా!