ఆమ్‌చూర్‌ ఆశలు ఆవిరి | - | Sakshi
Sakshi News home page

ఆమ్‌చూర్‌ ఆశలు ఆవిరి

May 19 2025 2:36 AM | Updated on May 19 2025 2:36 AM

ఆమ్‌చూర్‌ ఆశలు ఆవిరి

ఆమ్‌చూర్‌ ఆశలు ఆవిరి

సిరిసిల్ల: మామిడి టంకర(ఆమ్‌చూర్‌) వ్యాపారం ఢీలా పడిపోయింది. అకాల వర్షాలు.. ఈదురుగాలులతో ఇప్పటికే చెట్టుపై ఉన్న కాయల్లో పావువంత రాలిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆమ్‌చూర్‌కు సరైన ధర లేక మామిడిరైతులు, కాంట్రాక్టర్‌లు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.35వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేలు పలుకుతుంది.

ఆమ్‌చూర్‌ వినియోగం ఇలా

మామిడికాయల పొట్టు తీసి, ముక్కలుముక్కలుగా కోసి ఎండలో ఎండబెడతారు. ఇలా ఎండిన ముక్కలను మామిడి టంకర అంటారు. అన్‌సీజన్‌లో వంటకాలలో వాడుకుంటారు. జిల్లాలోని పల్లెల్లో ఆమ్‌చూర్‌ను తయారుచేసి నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాదికో పంట కావడంతో మామిడికాయలను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేక.. ఆమ్‌చూర్‌ చేసి అమ్ముకుంటున్నారు. ఆమ్‌చూర్‌కు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్‌ ఉంది. మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు ఒప్పందం చేసుకొని ఎగుమతి చేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సగం ధరనే ఉండడంతో మామిడి రైతులు, కాంట్రాక్టర్‌లు ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షాలు.. రాలిన కాయలు

జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్‌, కోనరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి మండలాల్లో మామిడితోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. తోటలను స్థానికులు కాంట్రాక్ట్‌ తీసుకుని చెట్లకు కాపలా ఉండి కాయలను కాపాడుకున్నారు. మరో పక్షం రోజుల్లో కాయలు చేతికొస్తాయని భావించగా.. అంతలోనే ఈదురుగాలులతో కాయలే రాలిపోయాయి. దీంతో మార్కెట్‌లో నాణ్యమైన మామిడికాయలకు కొరత ఏర్పడింది. ఈ సీజన్‌లో ఊరగాయల(తొక్కు)కు మామిడికాయలు పెద్దగా రావడం లేదు. ఉన్న కొద్దిపాట కాయలకు ధర మంచిగానే ఉన్నా మార్కెట్‌లో ఆమ్‌చూర్‌కు ధర లేక మామిడి రైతులు దిగాలు పడుతున్నారు.

మామిడి దిగుబడి లేదు.. టంకరకు ధర లేదు

అకాల వర్షాలు.. ఈదురుగాలులతో నష్టాలు

మామిడి టంకర వ్యాపారం ఢీలా

ధర

నిర్ణయించేది దళారీ

ఆమ్‌చూర్‌ విక్రయాలకు కరీంనగర్‌ జిల్లాలో పెద్దగా మార్కెట్‌ లేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్‌, లేదా హైదరాబాద్‌లో మార్కెట్‌ ఉండగా.. మహారాష్ట్ర వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. గతేడాది క్వింటాల్‌ ఆమ్‌చూర్‌కు రూ.35వేలు పలికింది. ఈ–నామ్‌ మార్కెట్‌ ఆధారంగా ఆమ్‌చూర్‌కు ధర నిర్ణయించాల్సి ఉండగా.. దళారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఆమ్‌చూర్‌ ధర కనీసం క్వింటాలుకు రూ.30వేలు ఉంటే గిట్టుబాటవుతుందని మామిడి రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు మామిడికాయల దిగుబడి లేక.. ఇటు అకాల వర్షాలతో కాయలు రాలిపోయి.. మరోవైపు మామిడి ఒరుగులకు ధర లేక ఈ ఏడాది తోటలను నమ్ముకున్న రైతులు, కాంట్రాక్టర్‌ల ఆశలు ఆవిరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement