
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్‌క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్‌లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
హత్యలు, ఆత్మహత్యలు
● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు.
● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి.
● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
వేధింపులు ఆగడంలేదు
సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి,
ఎన్‌జీవో నిర్వాహకురాలు
కౌన్సెలింగ్ ఇస్తున్నాం
గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం.
– శ్రీలత, సీఐ,
కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్

ఇల్లాలు.. కన్నీళ్లు