
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయరంగంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ధాన్యం డబ్బులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌లను ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు మహమ్మద్ ఖాజా, షకీల్ ఉన్నారు.
కూలి తగ్గించడం శోచనీయం
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరలు నేసే కార్మికుల కూలి తగ్గించడం శోచనీయమని పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చీరల వస్త్రానికి యజమానులకు ఒక మీటరుకు రూ.32 నిర్ణయించగా, కార్మికుల కూలి ప్రకటించకపోవడంతో తక్కువగా ఇస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలకు ఇచ్చిన మాదిరిగా మీటర్‌కు రూ.5.25 కూలి ఇవ్వాలని కోరారు. నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఒగ్గు గణేశ్, బెజిగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో చేరాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. మైనార్టీ సంక్షేమ విద్యాసంస్థల్లో ప్రవేశాల పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడల్లో మైనార్టీ గురుకుల సంక్షేమ విద్యాసంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో ప్రవేశానికి 60 సీట్లు (మైనార్టీ పిల్లలకు) ఉన్నాయని, 6 నుంచి 8వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ చేస్తారని వివరించారు. సిరిసిల్ల విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీలో కలిపి 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. వేములవాడలోని విద్యాసంస్థలో ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) 30 సీట్లు, డెయిరీ టెక్నాలజీ కోర్సులో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వివరాలకు 79950 57908, 73311 70865లలో సంప్రదించాలని తెలిపారు. మైనార్టీ గురుకుల విద్యాసంస్థల జిల్లా ఇన్‌చార్జి భారతి, ఆయా విద్యాసంస్థల హెచ్‌ఎంలు లక్ష్మీనారాయణ, ఫాతిమా పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి