జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాల
● జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాల ● నేడు ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి ● హాజరవుతున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ● 35 ఎకరాల్లో రూ.69.30కోట్లతో నిర్మాణం
సిరిసిల్ల: ఎండిన చెరువులు.. ఇసుక తేలిన వాగులు.. నెర్రలుచూపిన భూములు.. ఉపాధి లేక ముంబయి, భీవండి వలసలు.. నేతన్నల ఆకలిచావులు.. దశాబ్దం క్రితం సిరిసిల్ల మెట్టప్రాంతంలో నిత్యం కనిపించే దృశ్యాలు. ఇప్పుడు జిల్లా ముఖచిత్రం మారింది. గోదావరి జలాలు జిల్లాకు చేరాయి. ఏడాది పొడవునా నీటితో మధ్యమానేరు, అనంతగిరి, ఎగువమానేరు, మూలవాగు ప్రాజెక్టులతో మెట్టప్రాంతం పంటలతో కళకళలాడుతోంది. పెరిగిన వ్యవసాయ విస్తీర్ణంతో జిల్లా నేడు జలసిరుల ఖిల్లాగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పా టు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద 35 ఎకరాల్లో రూ.69.30 కోట్లతో నిర్మించారు. సర్ధాపూర్ వద్ద వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటైన విషయం తెలిసిందే. వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో సాగురంగంలో పరిశోధనలకు, వ్యవసాయ చదువులకు బాటలు పడుతున్నాయి.
రాష్ట్రంలో ఆరో వ్యవసాయ కళాశాల
రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో వ్యవసాయ కళాశాలను తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద సిద్దిపేట ప్రధాన రహదారిపై నిర్మించారు. 2018 ఆగస్టు 9వ తేదీన ఈ కళాశాలకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ కాలేజీలో బీఎస్సీ(అగ్రికల్చర్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. సాగులో వస్తున్న మార్పులు, వ్యవస్థాపక సామర్థ్యాలతో రైతులు, పరిశ్రమల అవసరాలను తీర్చే రీతిలో వ్యవసాయ పరిశోధనలు, బోధనలు సాగుతుంది. వ్యవసాయశాస్త్రం, జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం, మృత్తికశాస్త్రం, వ్యవసాయ రసాయనశాస్త్రం, కీటకశాస్త్రం, హర్టీకల్చర్, వ్యవసాయ ఇంజినీరింగ్, మైక్రోబయోలజీ, వ్యవసాయ విస్తరణ వంటి విభాగాలు ఉన్నాయి. జిల్లాలో భూసారానికి అనువైన వ్యవసాయ వంగడాల నిర్ధారణ, పరిశోధనలతో శాసీ్త్రయ అంశాలు జిల్లా రైతాంగానికి దరిచేరనున్నాయి. అధిక దిగుబడులు సాధించేందుకు, ఆధునిక విధానాలు అనుసరించేందుకు, జలవనరులను సమర్థంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆధునిక సముదాయం
వ్యవసాయ కళాశాల సముదాయాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 విధానంలో 2.60 లక్షల చదరపు విస్తీర్ణంలో కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతులు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనక్షేత్రం, ఫాం లాండ్స్‌ను ఏర్పాటు చేశారు. ఆధునిక కంప్యూటర్‌ల్యాబ్, ప్రయోగశాల, సెమినార్ రూమ్, అధ్యాపకుల గదులు, అసోసియేట్ డీన్‌చాంబర్, ఆధునిక లైబ్రరీని నిర్మించారు. వ్యవసాయ కళాశాలను అత్యాధునిక హంగులతో నిర్మించారు.
ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు
కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా అధికారులు మంగళవారం పర్యవేక్షించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్ పరిశీలించారు. కళాశాల వద్ద హెలీప్యాడ్‌ను, సభాస్థలిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మార్పులు సూచించారు. భోజన ఏర్పాట్లు, వీఐపీ గ్యాలరీ పరిశీలించారు. ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, స్థానిక సర్పంచ్ మాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాట్లను మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. కళాశాలను బుధవారం మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, పవర్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీన్, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఉన్నారు.
స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి
నేడు ప్రారంభోత్సవం
జిల్లెల్ల వ్యవసాయ కళాశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ప్రారంభిస్తారు. విశిష్ఠ అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నారు.
జిల్లెల్లలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న నాయకులు


