
నాగారంలో ప్రచారం చేస్తున్న ఆది శ్రీనివాస్
● డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ● నాగారంలో హాథ్‌సే హాథ్ జోడో యాత్ర
కోనరావుపేట(వేములవాడ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తరిమికొట్టాలని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని నాగారంలో శుక్రవారం ఇంటింటికీ హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో 8 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విద్యుత్, బస్సు, రిజిష్ట్రేషన్ చార్జీలను పెంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న నాయకులు సంక్షేమ పథకాలకు నిధులు లేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక, నిరుద్యోగ భృతి ఇవ్వక యువతను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ.450 ఉండగా ప్రస్తుతం రూ.1,250 చేరిందన్నారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, భాస్కర్‌రావు, భూషణం, తాళ్లపెల్లి ప్రభాకర్, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు.