● కలెక్టరుకు వినతిపత్రం అందించిన ఉద్యోగులు
మార్కాపురం: ఆర్టీసీ బస్సులను ప్రైవేటుపరం చేయవద్దని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సోమయాజుల సుబ్బశాస్త్రి, జిల్లా కార్యదర్శి జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయసునీతకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతూ ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుపరం చేయకుండా ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలని కోరారు. దీనివలన కొత్త ఉద్యోగాలు రావడంతోపాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని, ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జూనియర్ జట్టు ఎంపిక ఈనెల 20న స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఆసక్తిగల క్రీడాకారులు సాయంత్రం 3గంటలకు ఎంపిక ప్రదేశంలో హాజరుకావాలి. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27 నుంచి 29వరకు విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9666702555ను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.
● ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షలో కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం 2026–27 కింద నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం కింద 98,475 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. డ్వాక్రా సంఘాలు, శ్రామిక సంఘాలు, మెప్మా గ్రూపులను భాగస్వాములుగా చేసుకొని డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా, జీఎస్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, సీపీఓ, డీపీఓ, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా, ఐసీడీఎస్ శాఖల ప్రాజెక్టు అధికారులు, జీఎస్‌డబ్ల్యూ, వయోజన విద్యా శాఖ డీడీ, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్‌పురం(పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామివారి ఆలయానికి ఆదివారం రూ.2,02,311 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్‌జీఆర్ నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,04,456, లడ్డుప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,400, శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.48,907, పంచామృతాభిషేకానికి విరాళంగా రూ.11,032, ఇతర విరాళాలుగా రూ.2,516, స్వామివారికి శ్రీపాద కానుకల కింద రూ.6 వేలు విరాళాలుగా వచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్: కారు డ్రైవింగ్‌లో పురుషులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరక్టర్ పీ శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 29 నుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులకు 19 సంవత్సరాలు నిండి ఉండాలని, 50 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు 9573363141 అనే నంబరుపై సంప్రదించవచ్చన్నారు.


