మార్కాపురం టౌన్: జిల్లాలో జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఆక్రమణలు తొలగించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో ఉన్న 3 జాతీయ రహదారులపై ఆక్రమణలు తొలగించేందుకు జాయింట్ కమిటీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై అక్రమంగా ఉన్న దుకాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో పశువులను జాతీయ రహదారులపై తోలకుండా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను తనిఖీలు నిర్వహించి గుర్తించాలన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బాలూ నాయక్, ఆర్టీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


