అప్పులపాలయ్యాం
యర్రగొండపాలెం:
వ్యవస్థలో లోపాలు, అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు కలిసి ఆడిన మోసపూరిత ఆటలో రైతులు ఓడిపోయారు. మూడు నెలలపాటు చోమటోడ్చి పండించిన మొక్కజొన్న పంటను కొందరు వ్యాపారులు కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తే.. మరికొందరు మాత్రం గద్దల్లా తన్నుకుపోయి రైతులకు చిల్లిగవ్వ దక్కనీయలేదు. రైతుల శ్రమను దోపిడీ చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు, దళారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొలంలో విత్తు దశ నుంచి పంట కోత వరకు రైతులకు అండగా నిలిచి, గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాపారుల మోసాలు, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదేమీ చేయకపోగా వ్యవసాయదారులను పరోక్షంగా దెబ్బకొట్టే చర్యలకు పూనుకుంది.
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో 2 వేల మంది రైతులు దాదాపు 7 వేల ఎకరాల్లో విత్తన మొక్కజొన్న సాగు చేశారు. రాష్ట్రంతోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారులు ఇక్కడి గ్రామాలకు దళారులను పంపి మొక్కజొన్న సాగు చేసేలా రైతులను ఒప్పించారు. ‘ఉచితంగా విత్తనాలు అందిస్తాం. పంట సాగు సమయంలో రూ.10 వేలు ఇస్తాం. పంట కోత అయ్యాక విత్తనాలు మేమే కొనుగోలు చేస్తాం’ అనేది రైతులతో చేసుకున్న ఒప్పంద సారాంశం. ముందుగా అనుకున్న ప్రకారం విత్తనాలు ఇచ్చి పంట సాగు చేయించిన వ్యాపారులు రోజుల వ్యవధిలోనే రైతులతో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడిచారు. పెట్టుబడి కోసం ఇస్తామన్న రూ.10 వేలు ఎగ్గొట్టడంతోపాటు మాటలు చెప్పి మభ్యపెట్టారు. వాస్తవానికి ఈ రూ.10 వేలు సైతం రైతుకు వచ్చిన ఆదాయంలో మినహాయించుకునేవే అయినప్పటికీ ఆ డబ్బు ఇవ్వలేదు.
మోసం ఇలా..
పెద్దారవీడు మండలంలోని శివాపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌కు చెందిన ఒక వ్యాపారి మొక్కజొన్న పంటను టన్ను రూ.34 వేల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు విత్తనాలు పంపిణీ చేశాడు. ఆ విత్తనాలతోపాటు భూమి దున్నుకోవటానికి ఎకరాకు రూ.10 వేల ప్రకారం ఇస్తామని చెప్పడంతో రైతులు ఆశపడి మొక్కజొన్న పంట పండించారు. నాసిరకం విత్తనాలు కావడంతో కొంత మంది రైతులకు ఒకటిన్నర టన్నులు, మరి కొందరు రైతులకు టన్ను చొప్పున మాత్రమే దిగుబడి వచ్చింది. పంట వేసుకునే సమయంలో ఇస్తామన్న రూ.10 వేలను వ్యాపారి ఇవ్వలేదు. పంట కోతకొచ్చిన తర్వాత సైతం మాయమాటలు చెబుతూ ఆ గ్రామం వైపు తిరిగి చూడలేదు. చేసేదిలేక రైతులు కళ్లాల్లో మొక్కజొన్న ఆరబోసి కొనేవారి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రోజులైనా విత్తన కంపెనీ స్పందించకపోవడంతో సదరు రైతులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో దిగివచ్చిన మేడ్చల్ కంపెనీ యజమాని ఆ పంటను కొనుగోలు చేశాడు. ఆ కంపెనీ ఏర్పాటు చేసిన ఏజెంట్ పంటను పూర్తిగా ఎత్తుకెళ్లాడు. ఈ సమయంలో రైతులకు అందించిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో లబోదిబోమంటున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు
విత్తన మొక్కజొన్న పేరుతో రైతులను ముంచిన బ్రోకర్లు
యర్రగొండపాలెం నియోజకవర్గంలో 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
పంట దిగుబడి ఎత్తుకెళ్లి డబ్బు ఎగ్గొట్టిన వ్యాపారులు
రైతులకు ఇచ్చిన బ్యాంక్ చెక్కులు బౌన్స్
మొక్కజొన్న పంట సాగు చేసి రైతులందరం అప్పులపాలయ్యాం. దిగుబడి బాగా వస్తుందని, మంచి ధర ఇప్పిస్తామని బ్రోకర్ చెప్పి పంట విత్తించాడు. ముందుగా విత్తనాలు ఉచితంగా ఇచ్చాడు. ఖర్చుల కోసం ఎకరాకు రూ.10 వేల ప్రకారం ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టాడు. పంట విత్తుకున్న నాటి నుంచి కోతకు వచ్చే వరకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పంటను కొనుగోలు చేయించడం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పంట కొన్నాక ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. పెట్టుబడి కోసం చేసిన అప్పునకు వడ్డీ పెరిగిపోతోంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
– పెనుగొండ కొటిరెడ్డి, మొక్కజొన్న రైతు, శివాపురం
దిగుబడి లేక.. పెట్టుబడి దక్కక..
ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఒక్కో రైతు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట దిగుబడి 3 టన్నుల వరకు వస్తుందని రైతులు ఆశించగా టన్ను నుంచి 2 టన్నులకే పరిమితమైంది. టన్ను రూ.34 వేల చొప్పున విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా పండించిన పంటను వ్యాపారులు ఎత్తుకెళ్లి డబ్బు ఎగ్గొట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.


