● మాజీ మంత్రి మేరుగు,
ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరి
రైతాంగ పోరాటాలకు వైఎస్సార్ సీపీ సీపీ మద్దతు తప్పక ఉంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు పేర్కొన్నారు. సోమవారం ఎన్జీ రంగా భవన్‌లో పొగాకు రైతుల సదస్సుకు హాజరై మద్దతు తెలిపి ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రూ.300 కోట్ల విలువైన పొగాకును అప్పటి సీఎం వైఎస్ జగన్ కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆశించిన విధంగా వర్జీనియా పొగాకును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
ఒంగోలు సిటీ: పొగాకు రైతులు తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బేళ్లు తిరస్కరిస్తూ.. ధర తెగ్గోస్తూ రైతులను నానాఇబ్బందులకు గురిచేయడం సరికాదని రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. టన్ను పొగాకు రూ.30 వేలకు కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలులోని ఎన్జీ రంగా భవన్‌లో పొగాకు రైతుల సదస్సు నిర్వహించగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, వడ్డే హనుమారెడ్డి, పరిటాల కోటేశ్వరరావు కోడూరు నాంచార్లు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతి బాబు మాట్లాడుతూ.. గత ఏడాది ఒక్కో బ్యారన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర రైతుల నష్టపోయారని, ఈ ఏడాది ధరలను బట్టి చూస్తే ఐదారు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం కేంద్రానికి తెచ్చిన పొగాకు బేళ్లలో 70 శాతానికి పైగా తిరిగి వెనక్కు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడటం శోచనీయమన్నారు. కూలీలకు సైతం డబ్బు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో పొగాకు ధరలపై చర్చించడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన గుంటూరులోని టుబాకో బోర్డు వద్దకు రాయబారానికి వెళ్లనున్నట్లు చెప్పారు. అందుకు సన్నాహకంగా ఈ నెల 25వ తేదీన వేలం కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. పొగాకుపై 40 శాతం జీఎస్టీ పెంపుదల సాగుదారులకు శాపంగా మారిందన్నారు. పొగాకు కొనుగోలు చేస్తున్న ఐటీసీకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. పంట పండిస్తున్న రైతులు బ్యారన్‌కు ఐదారు లక్షల రూపాయలు నష్టపోతుండటం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే అందుకు కారణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి పొగాకుపై రూ.90 వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు కేటాయించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు సర్కారు లెటర్లు రాయడం ఆపేసి, పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమెరికా–ఇండియా వాణిజ్య ఒప్పందం వల్ల ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ పొగాకు రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో బోర్డు లేదని, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.లలిత కుమారి, నెల్లూరు జిల్లా రైలు సంఘం కార్యదర్శి మూలే వెంకయ్య, మార్కాపురం రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఊస వెంకటేశ్వర్లు, ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ నాయకులు శేషయ్య, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు, పొగాకు బోర్డు మాజీ సభ్యులు మారెళ్ల బంగారు బాబు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కొండ్రగుంట సుబ్బారావు, షేక్ సైదా, రైతులు పాల్గొన్నారు.
మేరుగ నాగార్జున
చుండూరి రవిబాబు
టుబాకో బోర్డు తీరుతో ఒక్కో బ్యారన్‌కు రూ.5 లక్షల మేర నష్టం
టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు
కేంద్రానికి సీఎం చంద్రబాబు లెటర్లు రాస్తే ఒరిగేదేమీ లేదు
పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి నిధులు కేటాయించాలి
పొగాకు రైతు సదస్సులో నాయకుల ధ్వజం
25న వేలం కేంద్రాల వద్ద నిరసన.. జూన్ 1న బోర్డుతో రాయబారం


