● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: రైతులకు పథకాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంచేందుకు ‘ఆత్మ నిర్భర భారత్ మిషన్’ కింద తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ప్రకాశం భవన్‌లో జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పప్పు ధాన్యాల సాగును పెంచేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు. ఆత్మ పీడీ రత్న మంజుల, జెడ్పీ సీఈఓ చిరంజీవి, నాబార్డ్ డీడీఎం రవికుమార్, ఎల్‌డీఎం రమేష్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జన గణన విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు ఆదేశించారు. జిల్లాలో పురోగతిపై సోమవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణన విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రతి ఇంటికి గరిష్టంగా ఐదు నిమిషాలు మాత్రమే పట్టే సర్వేలో ఎందుకు స్పష్టమైన పురోగతి ఉండటం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తమ పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకొని సర్వే త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ సుధాకర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఈఓ రేణుక, జన గనణ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దొనకొండ: అనారోగ్యంతో బాధపడుతూ చర్చి పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్సై ఎల్ రామకృష్ణ వివరాల ప్రకారం..పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గాలిమూటి నాగలక్ష్మీ(25)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఉదయం ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. తీరా చూసే సరికి చర్చి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు గమనించి మెరుగైన వైద్యం నిమిత్తం దర్శికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. నాగలక్ష్మీ తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పెద్దదోర్నాల: మండల కేంద్రంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యవకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మండలానికి చెందిన కొందరు యువకులు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను విచారించన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ అజయ్‌కుమార్ తెలిపారు.


