చిన్నారి తులసి హత్య కేసులో నిందితురాలు భాజీబీని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు శివారెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామన్న డీఎస్పీ
త్రిపురాంతకం: ముక్కుపచ్చలారని చిన్నారి తులసి హత్య కేసు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ యూ నాగరాజు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. త్రిపురాంతకానికి చెందిన ఎం.వెంకట తులసి వందన గత గురువారం హత్యకు గురైంది. ఈ కేసులో నిందితురాలు షేక్ భాజీబీని యర్రగొండపాలెం రోడ్డులో వై జంక్షన్ వద్ద ఆదివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చిన్నారి తులసి తండ్రి ఎం.శివారెడ్డికి ఇంటికి సమీపంలో నివాసముంటున్న షేక్ భాజీబీతో మూడేళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. దీని వల్ల శివారెడ్డి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దాంతో కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. తిరిగి గత ఐదు నెలలుగా ఫోన్ కాల్స్, రాకపోకలు సాగుతున్నాయి. ఇరవై రోజుల నుంచి శివారెడ్డి..భాజీబీ ఇంటిలో ఉంటూ వచ్చాడు. బయటకు వచ్చే క్రమంలో కుమార్తె తులసి చూడడంతో తిరిగి గొడవ జరిగే అవకాశం ఉందని, మధ్య అడ్డుగా ఉన్న తులసిని హతమారిస్తే తమకు ఎలాంటి అడ్డూ లేకుండా పోతుందని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి గురువారం తెల్లవారుజామున ఇంటి బయట తులసి నిద్రిస్తున్న సమయంలో భాజీబీ ఇంటికి శివారెడ్డి తీసుకెళ్లగా అరవకుండా నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు గట్టిగా పట్టుకుని, మెడకు డోర్ స్ప్రింగ్, చార్జర్ వైర్ వేసి బిగించి, రోకలి బండతో కంటిపైన తలపైన కొట్టి హతమార్చడంతో తులసి మృతి చెందింది. కేవలం తమ సంబంధం బయటపడి గొడవలకు దారితీస్తుందని తులసిని హతమార్చారు. ఈ కేసులో ఎస్పీ వీ హర్షవర్థన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించి తగిన సూచనలు చేసి కేసు వేగవంతంగా పూర్తి చేశారు. సీఐ అసాన్ కేసు దర్యాప్తు మేరకు శివారెడ్డి, భాజీబీ ఇద్దరూ కలిసి చిన్నారి తులసిని హత్యచేసినట్లు తెలిపారు. శివారెడ్డిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. సీఐ అసాన్, ఎస్‌ఐ శివరామయ్య పోలీస్ సిబ్బందిని అభినందించారు.


