బేస్తవారిపేట/కంభం: బేస్తవారిపేట, కంభం మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం పడింది. ఎండు మిర్చి కోసం పొలాల్లో పంటను ఆరబెట్టుకున్న రైతులు ఒక్కసారిగా వర్షం మొదలవడంతో ఇబ్బందులు పడ్డారు. కంభం నుంచి కందులాపురం రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడింది. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బేస్తవారిపేటలోని పాత సినిమాహాల్ సెంటర్, నేకునాంబాద్ రోడ్డులో చెట్టు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


