పృథులాపురి..జనఝరి
పొదిలిలో వైభవంగా నిర్మమహేశ్వరుని రథోత్సవం జన సంద్రంగా మారిన పురవీధులు
పొదిలిరూరల్: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పొదిలి పట్టణంలో వెలసిన పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి రథోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. విశేషంగా అలంకరించిన రథంపై అధిరోహించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించి తరించారు. రథాన్ని లాగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. హరహర మహాదేవ..శంభోశంకర అనే శివనామ స్మరణతో వీధులన్నీ మార్మోగాయి. వేలాది మంది భక్తులు వెంటరాగా స్వామి వారి ఉత్సవమూర్తులను పొదిలి పురవీధుల్లో ఊరేగించారు.
కళ్యాణం..కమనీయం:
రథోత్సవానికి ముందు స్థానిక నిర్మమహేశ్వరస్వామి దేవాలయంలో అర్చక స్వాములు మూలంరాజు సుబ్బనరసయ్య, దరిశి వెంకట సుధాకర్, దరిశి రామమూర్తిలు తెల్లవారుజామున 2 గంటలకు నిర్మమహేశ్వరుడు, పార్వతీదేవిలకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు ఉత్సవమూర్తులకు నందిసేవ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా గౌరీశంకర అలంకరణతో ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు. హోమాలు, ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి నీటితో వారుపోసి కుంభం పెట్టి పార్వేట బలీయడంతో వేలాది మంది భక్తజనం వెంటరాగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ సుమారు మధ్యాహ్నం 1.53 గంటలకు వేలాది మంది భక్తులు హరహర అంటూ శివనామస్మరణ చేస్తుండగా రథం కదిలింది. రథోత్సవాన్ని తిలకించడానికి పొదిలి పరిసర గ్రామాల నుంచి గాక, జిల్లా నలుమూలలు నుంచి కుల, మతాలకు అతీతంగా భారీగా భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధులన్నీ భక్త జన సంద్రంగా మారాయి. రథం తిరిగే సమయంలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి రథం చక్రాల కింద గుమ్మడి కాయలు పెటి, కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.
రథోత్సవంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు:
రథోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహుకులు ఆలయ మర్యాదలతో అధికారులు, ప్రజా ప్రతినిధులను బాజా భజంత్రీలతో తీసుకురాగా ఆలయ పాలకమండలి వారిని శాలువతో సన్మానించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రథం వద్ద టెంకామ కొట్టి రథాన్ని లాగారు. రథోత్సవంలో ఆలయ చైర్మన్ నుగ్గు వెంకటరామయ్య, తహశీల్దారు ఎంవీ కృష్ణారెడ్డి, ఈఓ నారాయనరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, డీ శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, సాయి రాజేశ్వరరావు, కే నరసింహారావు, వినోద్, కొత్తపులి బ్రహ్మారెడ్డి, సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మోరాబోయిన మురళి, మోరా శంకర్‌రెడ్డి, రెడ్డెం వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
రథోత్సవం సందర్భంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్కాపురం గుంటక వనజాక్ష్మిబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాటం, అఘోరీల వేషధారణ, కొంత మంది కళాకారులు చేసిన విచిత్ర విన్యాసాలు కనువిందు చేశాయి. డప్పులు కొడుతూ, బాణసంచా కాల్చుతూ యువకులు చిందులు వేసుకుంటూ తిరునాళ్లకు వచ్చిన భక్తులను ఉత్సాహపరిచారు.
పృథులాపురి..జనఝరి
పృథులాపురి..జనఝరి


