చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయిన ప్రజలు
సూపర్ సిక్స్ అమలు చేయకుండానే చేసినట్లు ప్రకటించుకున్న చంద్రబాబు ప్రశ్నించిన వారందరిపై కేసులు నమోదు చేయిస్తున్న దగాకోరు ప్రభుత్వం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మోసపోయారని, ఇచ్చిన వాగ్దానాలు, ప్రజా సంక్షేమ పథకాలు నీరుగార్చి తాము అన్ని పథకాలు సూపర్‌గా అమలు పరిచామని గోబెల్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న పాలనలో ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు ముందుకు సాగాయని, వైఎస్సార్ సీపీ పాలనలో మహిళలకు పెద్దపీటవేశారని, ప్రతి నెలా వారి అకౌంట్‌లలో ఏదో ఒక పథకం కింద డబ్బులు జమయ్యేవని, కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏ ఒక్క పథకం ఆగలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించలేదని, ఈ ఏడాది కూడా చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యే పరిస్థితి లేదని, పేదలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి కేసులు నమోదు చేయిస్తున్నారని, అనేక మందికి జైలుకు కూడా పంపారని మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో మనమంతా ప్రజలకు అండగా నిలవాలని, వారికోసం పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరుగుతున్నాయని, ఈ ఎంపికలో నాయకుల ప్రమేయం ఏమాత్రం ఉండదని, మంచి కార్యకర్తలను, ప్రజల సమస్యలపై స్పందించే వారికే నాయకత్వం అప్పచెప్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల రమణారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, బాలకోటిరెడ్డి, తోకల ఆవులయ్య, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ పాల్గొన్నారు.


