చదును చేసేద్దాం.. ఆక్రమించేద్దాం..!
ఒంగోలు సబర్బన్: ఖాళీ జాగా కనిపస్తే వేసెయ్ పాగా...అన్న చందంగా తయారైంది అధికార టీడీపీకి చెందిన నాయకుల తీరు. ఒంగోలు నగరంలోని నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీకి చెందిన నాయకుల కన్నుపడింది. అనుకున్నదే తడువుగా స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారు. కలెక్టర్ కార్యాలయానికి, ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు పథక రచన చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు(సోదరులు)కూడబలుక్కొని సీఆర్‌పీ క్వార్టర్స్‌లో పార్కుకు దక్షిణం వైపు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌కు తూర్పు వైపున ఉన్న క్వార్టర్స్‌కు ఆనుకొని ఉన్న స్థలాన్ని నాలుగు రోజులుగా బాగు చేయిస్తున్నారు.
అడిగేదెవరు..?
సీఆర్‌పీ క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్లను స్థలం కాజేయటానికి పూనుకున్న అక్రమార్కులు అక్కడ ఉన్న చెట్లను గంపగుత్తగా రూ.50 వేలకు అమ్ముకున్నారు. దాదాపు 250 గదులకు పైగా శుభ్రం చేసిన కబ్జాదారులు అందులోని చిల్లచెట్లు, వేపచెట్లను అమ్మేశారు. ఆ ఖాళీ స్థలంలో ఉన్న చెట్టు మొత్తం కొట్టించారు. అన్నవరప్పాడు రెవెన్యూ సర్వే నంబరు–3లో భారీ స్థాయిలో చెట్లు కొట్టించి మరీ అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. కొంత స్థలంతో పాటు ఆ స్థలానికి ఆనుకొని ఉన్న కొండను తొలిచేందుకు రంగం సిద్ధం చేశారు. దాదాపు 250 గదులకు పైగా స్థలాన్ని కాజేసేందుకు పూనుకున్నారు. అక్కడ అతి తక్కువ అనుకున్నా గది రూ.2 లక్షలకు పైగానే ధర ఉంది. ఆ ప్రకారం ఆ స్థలం విలువ సుమారు రూ.5 కోట్లకు పైనే. నగరం నడిబొడ్డులో కబ్జా...ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏ ఒక్క విభాగానికి చెందిన అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం. అయినా ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో ఉంది కాబట్టి కనీసం నగర పాలక సంస్థ అధికారులైనా కబ్జాను గుర్తించాలి. కానీ ఏ ఒక్క ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులు ఆ ఆక్రమణలను అడ్డుకునే పరిస్థితులు చేపట్టలేదు. అంటే అధికారులకు తెలిసే ఈ కబ్జా పర్వం కొనసాగుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
చెట్లు కొట్టి కొండను చదును చేసేందుకు సిద్ధం చేస్తున్న అక్రమార్కులు
సీఆర్‌పీ క్వార్టర్స్‌లో చెట్లు కొట్టి బాగు చేస్తున్న
ప్రభుత్వ స్థలం
నగరం నడిబొడ్డున రూ.5 కోట్ల విలువైన స్థలంపై టీడీపీ నాయకుల కన్ను
సీఆర్‌పీ క్వార్టర్స్‌లోని ఆర్‌అండ్‌బీకి చెందిన ఖాళీ స్థలం కబ్జాకు కుట్ర
సర్వే నంబర్ 3లో ఉన్న చెట్లు కొట్టించి చదును చేస్తున్న వైనం
కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
చదును చేసేద్దాం.. ఆక్రమించేద్దాం..!


