కోర్టు వివాద భూమి ఆన్‌లైన్‌.. | - | Sakshi
Sakshi News home page

కోర్టు వివాద భూమి ఆన్‌లైన్‌..

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

కోర్టు వివాద భూమి ఆన్‌లైన్‌..

కోర్టు వివాద భూమి ఆన్‌లైన్‌..

మర్రిపూడి: నకిలీ వంశవృక్షం సర్టిఫికెట్‌ సృష్టించి కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఆన్‌లైన్‌ చేశారని వేమవరం పంచాయతీ రామచంద్రాపురానికి చెందిన వృద్ధురాలు శేషమ్మ ఆరోపించారు. బాధితురాలు సోమవారం రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని కోర్టులో ఉన్న నా భూమిని అక్రమంగా ఎలా ఆన్‌లైన్‌ చేశారని తహసీల్దార్‌ జనార్దన్‌ను నిలదీసింది. దీంతో సమాధానం చెప్పలేక తహసీల్దార్‌ నీళ్లు నమిలారు. బాధితురాలి కథనం మేరకు...వేమవరం పంచాయతీ రామచంద్రాపురం రెవెన్యూ సర్వే నం.35లో 47.75 ఎకరాల పట్టా భూమి ఉంది.

ఈ భూమి అదే గ్రామానికి చెందిన నలుగురు రైతుల పేర్లపై రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అయితే ఎఫ్‌ఎల్‌ఆర్‌ దాఖలా మొదటి పేరు ముప్పరాజు పాపయ్య వాటా కింద 11.93 ఎకరాల భూమి వచ్చింది. ముప్పరాజు పాపయ్య చనిపోవడంతో వారసత్వంగా అతని ఇద్దరు కుమారులకు దక్కాల్సి ఉంది. అయితే పాపయ్య ఇద్దరు కుమారులు, పెద్దకోడలు సైతం మృతి చెందారు. వీరి ఇద్దరికి సంతానం లేదు. దీంతో ఆ ఆస్తికి చిన్న కుమారుడు బక్కయ్య భార్య ముప్పరాజు శేషమ్మ వారసురాలు. తనకు ఎవ్వరూ దిక్కులేరనే దురాలోచనతో ఈ భూమిపై ఒంగోలుకు చెందిన రియల్టర్‌ మారం వెంకటేశ్వరరెడ్డి కన్ను వేశాడని శేషమ్మ ఆరోపించింది. వేమవరం గ్రామానికి చెందిన ముప్పరాజు అనే ఇంటిపేరు ఉన్న వ్యక్తి ముప్పరాజు తిరుపతయ్యకు నకిలీ వంశవృక్షం ధ్రువీకరపత్రాన్ని రియల్టర్‌ వెంకటేశ్వరరెడ్డి సృష్టించి తిరుపతయ్యతో అగ్రిమెంట్‌ చేయించుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకు ముప్పరాజు తిరుపతయ్య చనిపోయాడని, నకిలీ వంశవృక్షం ధ్రువీకరణ పత్రంతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించాడని ఆమె ఆరోపించింది. 11.93 ఎకరాలను వెంకటేశ్వరరెడ్డి తన పేరుతో ఆన్‌లైన్‌ చేయించుకున్నాడని తెలుసుకొని కార్యాలయానికి వచ్చానని శేషమ్మ చెప్పింది. మా మామ ద్వారా సంక్రమించిన భూమిని ఇతరుల పేరుతో ఎలా ఆన్‌లైన్‌ చేస్తారని తహసీల్దార్‌ను నిలదీసింది. ఇప్పటికే భూమి విషయమై కోర్టులో పెండింగ్‌ ఉందని, ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్న విషయం మీకు తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించింది. దీంతో తహసీల్దార్‌ ఆమెకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

నకిలీ వంశవృక్షం సర్టిఫికెట్‌ సృష్టించి ఆన్‌లైన్‌

కోర్టులో ఉన్న భూమిని ఎలా ఆన్‌లైన్‌ చేస్తారని తహసీల్దార్‌ను నిలదీసిన బాధితురాలు

సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement