గుట్కాయ స్వాహా..
ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా గుట్కా విక్రయాలు ఒంగోలు, సింగరాయకొండల్లో విజిలెన్స్ దాడులు విజిలెన్స్ దాడుల్లో భారీగా పట్టివేత నామ మాత్రంగా జరిమానా వేయడంపై పలు కథనాల ప్రచారం ఒంగోలులో దాడులు చేసిందెవరన్న దానిపై భిన్నవాదనలు పోలీసులే దాడులు చేశారంటూ ప్రచారం గుట్కా వ్యాపారి వద్ద నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ప్రచారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన గుట్కా మామూళ్ల వ్యవహారం
కాసులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచడం అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు కాసులు కురిపిస్తోంది. లక్షలాది రూపాయల సరుకును నిల్వలు చేసుకొని రహస్యంగా నిల్వలు చేసినటు్ట్ సమాచారం. ఇదే అదనుగా తీసుకున్న విజిలెన్స్, పోలీసు అధికారులు కొందరు తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరాయకొండ, ఒంగోలులో జరిగిన తనిఖీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అధికారుల దాడుల సాకుతో వ్యాపారులు గుట్కాలను అధిక ధరలను విక్రయించి సొమ్ముచేసుకుంటుండడం గమనార్హం.
సింగరాయకొండ తనిఖీల్లో దొరికిందెంత...?
సింగరాయకొండలోని హోల్‌సేల్ దుకాణాల్లో ఈనెల 2వ తేదీ సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని ఒక హోల్ సేల్ దుకాణంలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు రూ.50 వేలు విలువ చేసే పొగాకు ఉత్పత్తులను పట్టుకొని జరిమానా విధించినట్లు ప్రకటించారు. అయితే విజిలెన్స్ తనిఖీల్లో గుట్కాలతోపాటుగా సిగరెట్లు, విదేశీ సిగరెట్లు, నకిలీ గుట్కాలు, ఖైనీలు, సిగరెట్లు దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. రూ.10 లక్షలకు పైగా విలువ కలిగిన సరుకు పట్టుకున్నట్లు వ్యాపారవర్గాలు గుసగసలాడుకుంటున్నాయి. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీ ఎత్తున నిల్వలు గుర్తించినా కేవలం రూ.50 వేలు విలువైన సరుకును మాత్రమే పట్టుకున్నట్లు చెప్పడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారినట్లు వ్యాపార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అదనపు ధరలకు విక్రయిస్తున్నా...
ఒంగోలులో తనిఖీలు చేసిందెవరు...?
ఇక ఒంగోలులోని ఇస్లాంపేటలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా తాలుకా పోలీసు స్టేషన్ పరిసరాల్లో కూడా తనిఖీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తనిఖీలను విజిలెన్స్ అధికారులే చేశారా..లేక పోలీసులు చేశారా అనే విషయం మీద స్పష్టత లేదు. పోలీసులే తనిఖీలు చేసినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఒక ఉన్నతాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైల టీం ఒకటి ఈ తనిఖీలను నిర్వహించిందని, మంగమూరు డొంకకు చెందిన ఒక గుట్కా వ్యాపారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భారీగా నెలమామూళ్లు ముట్టచెప్పేలా మధ్యవర్తి ఒకరు ఒప్పందం కుదిర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లాలోని పోలీసు వర్గాల్లో కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది. ఈ దొడ్డి దారి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని, శాఖాపరంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
మార్కెట్లో జోరుగా నకిలీలు
నెలవారి మాముళ్ల మత్తులో అధికారులు జోగుతుండడంతో నకిలీ గుట్కాలు, సిగరెట్లు బహిరంగ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. నకిలీ గుట్కాలు ఒరిజనల్ గుట్కాల కంటే తక్కువ ధరలకు లభిస్తుండడంతో కొందరు వ్యాపారులు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ గుట్కా ప్యాకెట్లు త్వరగా డ్యామేజీ అవుతున్నాయని, ప్యాకెట్ సైజులో తేడా ఉండడం గమనించవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
గుట్కాలు, సిగరెట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు, బీడీ బంకులు, హోటళ్లు, చిల్లర దుకాణాలలో వీటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా గుట్కాలపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు రేటు పెంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. సిగరెట్లు కూడా రెండు రూపాయల వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనక మతలబేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జోరాబుల్ గుట్కా ఎంఆర్‌పీ రూ.5 ఉండగా రూ.20కు, విమల్ రూ.5 ఉండగా రూ.20కు మూడు ప్యాకెట్లు, హాల్స్ రూ.8 ఉండగా రూ.25కు, మిరాజ్ రూ.15 ఉండగా రూ.20 కు విక్రయిస్తున్నారని సమాచారం. ఎంఆర్‌పీ ధరలకు అదనంగా విక్రయిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


