మీ అవినీతిపై సమాధానమివ్వు ఇంటూరీ.. | - | Sakshi
Sakshi News home page

మీ అవినీతిపై సమాధానమివ్వు ఇంటూరీ..

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

మీ అవినీతిపై సమాధానమివ్వు ఇంటూరీ..

మీ అవినీతిపై సమాధానమివ్వు ఇంటూరీ..

నియోజకవర్గంలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేదు రేషన్‌ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నది నిజం కాదా గ్రావెల్‌, మద్యం మాఫియాల నుంచి నెలకు ఎంత తీసుకుంటున్నారు? ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై మండిపడిన బుర్రా

కందుకూరు: ‘‘రేషన్‌, మట్టి, మద్యం మాఫియాల నుంచి ప్రతినెలా లక్షల్లో ముడుపులు తీసుకుంటూ ప్రశ్నిస్తే నాపై వ్యక్తిగత దాడి చేస్తావా, ముందు నియోజకవర్గంలో చేస్తున్న అవినీతి కార్యకలాపాల గురించి ప్రజలకు సమాధానం చెప్పి ఆ తరువాత వైఎస్సార్‌ సీపీ గురించి మాట్లాడాలంటూ’’ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మండిపడ్డారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి అవినీతిపై బుర్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతినెలా లక్షల్లో అవినీతి సొమ్ము ఎమ్మెల్యేకి చేరుతుందంటూ పలు ఆధారాలను ఆయన బయటపెట్టారు. లింగసముద్రం మండలంలోని పెదపవని గ్రామంలో రేషన్‌ మిల్లు కేంద్రంగా చేసుకుని మాఫియా నడుస్తోందని చెప్పారు. స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఓ రేషన్‌బియ్యం వ్యాపారితో చేసిన సంభాషణను ఈ సందర్భంగా బుర్రా బయటపెట్టారు. రేషన్‌ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

బావ, బామ్మర్ది ట్యాక్స్‌ వసూల్‌ చేయడం లేదా...

నియోజకవర్గంలో మట్టిమాఫియా నుంచి నువ్వు, నీ బామ్మర్ది కలిసి ట్యాక్స్‌ వసూల్‌ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటూ బుర్రా నిలదీశారు. నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా మట్టిమాఫియా చెలరేగుతోందని, పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారని చెప్పారు. వీరి వద్ద నుంచి టిప్పర్‌కు ఇంత అని ట్యాక్స్‌ ఎవరు కట్టించుకున్నారని నిలదీశారు. ఎక్కడా ఒక్క టిప్పర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవన్నారు. అలాగే ఎవరైనా వైఎస్సార్‌ సీపీ నాయకులు సొంత అవసరాల కోసం ఒక ట్రాక్టర్‌ మట్టి తీసుకుంటే బండ్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌ల్లో పెట్టి వేధించడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 800ల వరకు బెల్టుషాపులు నిర్వహిస్తూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రస్తున్నారని, వీరంతా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి అవినీతిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత దాడి చేయడం సరైన విధానం కాదన్నారు.

గత ఎన్నికల్లో కరేడు గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులను కొనుగోలు చేసేందుకు, నువ్వు, నీ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి కలిసి ఖర్చు చేసినంత డబ్బులు కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఈ రెండేళ్ల పాలనలో ఖర్చు చేయలేదని బుర్రా విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పట్టణానికి రామతీర్ధం జలాలను తీసుకొచ్చి దాహార్తి తీరిస్తే, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రామాయపట్నం పోర్టు వచ్చిందని, అభివృద్ధి అంటే ఇదన్నారు. పట్టణంలో డివైడర్లు వేయడం మంచిదే కానీ వాటికి టీడీపీ రంగులు, లైట్లు వేసుకుని భారీ అభివృద్ధి జరిగినట్లు చెప్పుకోవడం కాదని హితవు పలికారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పేందుకు తాను సిద్ధమని సవాల్‌ చేశారు.

టీడీపీలో నీ పరిస్థితి ఏంటో చూసుకో...

‘‘అవినీతి గురించి చెప్పాలని ప్రశ్నిస్తే నా వ్యాపారాల గురించి, నియోజకవర్గంలో ఉండడం లేదని చెప్తున్నావు. వ్యాపారం చేయడం తప్పుకాదు, నేను వ్యాపారంలో సంపాదించిన డబ్బులనే నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. నీలా నేను చందాలు వసూల్‌ చేసి, అప్పులు చేసి ఖర్చు చేయడం లేదు. ఆ అప్పులు తీర్చుకునేందుకు అవినీతికి పాల్పడడం లేదన్నారు’’. వ్యాపారం కోసమే కొన్ని రోజులు బయట ప్రాంతాల్లో ఉంటున్నానని, అదే నియోజకవర్గంలోనే ఉంటే నీ దుకాణం బంద్‌ అవుతుందంటూ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఉన్న నీకు ప్రస్తుతం టీడీపీలో పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు. పాలనలో లాస్టు నుంచి మూడవ ర్యాంకు వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని ముందు దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు. బెదిరించే ధోరణిలో అనవసర విమర్శలు చేయడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేకి హితవు పలికారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే కల్తీ ఆరోపణలు

వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ కల్తీ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి ఆరోపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం కోట్లాది మంది హిందువులకు అవమానం అన్నారు. సిట్‌ నివేదికలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పినా టీడీపీ నేతలు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్‌కళ్యాణ్‌ స్వయంగా యూటర్న్‌ తీసుకున్నారని, జనసేన నాయకులు కల్తీ జరగలేదని చెప్తున్నారని గుర్తు చేశారు. జగన్‌పై తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు సమాధానం చెప్పకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని, పోర్టులు, షిప్పింగ్‌ హార్బర్‌లు, మెడికల్‌ కాలేజీలు వంటివి అన్నీ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, అవినీతి కార్యకలాపాల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మునిగితేలుతున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement